నేటి నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు యధాతధం

September 16, 2020
img

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు నిన్న గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగనున్నాయి. కరోనా నేపద్యంలో ఒకవేళ ఎవరైనా విద్యార్దులు ఈ పరీక్షలకు హాజరుకాలేకపోయినట్లయితే వారి కోసం మళ్ళీ త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్దులను కూడా రెగ్యులర్ విద్యార్దులుగానే పరిగణిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

విద్యార్దులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు, సిబ్బందికి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. యూనివర్సిటీలు, వాటి అనుబంద కళాశాలలో చదువుకొంటున్న విద్యార్దులు భౌతికంగానే పరీక్షలు వ్రాయవలసి ఉంటుందని, కానీ అటానమస్ కాలేజీలు, అటానమస్ యూనివర్సిటీలలో మాత్రం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పింది. 

డిగ్రీ, పీజీ పరీక్షలు ఇంకా పూర్తికాకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల గురించి ప్రకటన చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని, వాటి వలన ప్రజలకు ఇబ్బందులు లేదా నష్టం కలుగుతుందని భావించినప్పుడే ప్రజాహిత వాజ్యాలను విచారణకు స్వీకరిస్తుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. 


Related Post