హైదరాబాద్‌ ప్రైవేట్ పరిశ్రమలలో భారీగా ఉద్యోగాలు

July 01, 2020
img

లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రం నుంచి వేలాదిమంది వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలివెళ్ళిపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ పరిశ్రమలలో కార్మికులు లేకుండా పోయారు. దాంతో పరిశ్రమలు నడిపించడం చాలా కష్టంగా మారింది. మరోపక్క లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అనేకమంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయి నేటికీ నానా ఇక్కట్లు పడుతున్నారు. అటువంటివారికి ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రైవేట్ పరిశ్రమలలో చాలా అవకాశాలున్నాయని పాశమైలారం ఐలా చైర్మన్‌ చందుకుమార్‌ పొట్టి తెలియజేశారు. 

10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ చదివిన వారికి, ముఖ్యంగా ఐ‌టిఐలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ర్టీషియన్ వంటి కోర్సులు చేసినవారికి, స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ ఉద్యోగాలున్నాయని తెలిపారు. అసలు ఎలాంటి విద్యార్హతలు లేనివారికి హెల్పర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయని తెలిపారు. 

పఠాన్‌చెరు, పాశమైలారం, ఖాజీపల్లి, బొల్లారం, జీడిమెట్ల, గడ్డపోతారం తదితర పారిశ్రామిక వాడల్లో గల ప్రైవేట్ పరిశ్రమలలో అత్యవసరంగా కార్మికులు అవసరం ఉన్నారని చందుకుమార్ చెప్పారు. ఈ ఉద్యోగాలలో అనుభవం, అర్హత, పనితీరును బట్టి నెలకు కనీసం రూ.10-15,000 వరకు జీతాలు లభిస్తాయి. దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వలస కార్మికులు మళ్ళీ ఇప్పట్లో తిరిగిరాలేరు. ఒకవేళ వద్దామనుకొన్నా రైళ్ళు, బస్సులు తిరగడం లేదు. కనుక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.   

పటాన్‌చెరు పారిశ్రామికవాడలో గల ప్రైవేట్ కంపెనీలలో సుమారు 10,000 మంది కార్మికులు అవసరం ఉన్నట్లు ఐలా ఛైర్మన్ చందుకుమార్ తెలిపారు. పాశమైలారంలో సుమారు 3,000 మంది, గడ్డిపోతారం, ఖాజీపల్లిలో సుమారు 4,000 మంది, బొల్లారంలో సుమారు 2,000 మంది కార్మికులు, ముఖ్యంగా హెల్పర్లు అవసరం ఉందని తెలిపారు. కనుక ఆసక్తి అవసరం ఉన్నవారు తక్షణం 9948686478 నెంబరుకు ఫోన్‌ చేయవచ్చు లేదా తమ వివరాలను వాట్సాప్‌లో పంపించవచ్చునని తెలిపారు. 

ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో 4 వేల మంది కార్మికులు, హెల్పర్ల అవసరం ఉన్నది. మా పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని ఖాజీపల్లి, గడ్డపోతారం పరిశ్రమల సంఘం ప్రతినిధి శేఖర్‌ తెలిపారు. 

ప్రస్తుతం నగరంలో గల అన్ని పారిశ్రామికవాడల్లో గల ప్రైవేట్ కంపెనీలు కార్మికులను తీసుకొంటున్నాయి కనుక నిరుద్యోగులు తమకు సమీపంలో గల పారిశ్రామికవాడకు వెళ్ళి నేరుగా పరిశ్రమల యజమానులు లేదా వాటి మేనేజర్లను కలిసి ఉద్యోగాలు పొందవచ్చు.  ఇప్పుడు పరిశ్రమలలో చేరి ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే నెల తిరిగేసరికి జీతం చేతికి వస్తుంది. దాంతోపాటే అనుభవం కూడా వస్తుంది కనుక అవే కంపెనీలలో పర్మనెంట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. 

Related Post