సీబిఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు

June 26, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సీబిఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల 10, 12వ తరగతి పరీక్షలపై సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టినప్పుడు పరీక్షల నిర్వహణ గురించి ఆ రెండు బోర్డుల నిర్ణయాలను వాటి న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. 

 సీబిఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే 12వ తరగతి విద్యార్దులకు వారి గత పరీక్షల ఆధారంగా మార్కులు, గ్రేడ్లు కేటాయించాలనే తమ నిర్ణయంపై కొందరు విద్యార్దులు, వారి తల్లితండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలియజేసింది. కనుక భవిష్యత్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినపుడు మళ్ళీ 12వ తరగతి విద్యార్దులకు మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించాలనుకొంటున్నట్లు తెలిపింది. వాటికి హాజరు కావలా వద్దా అనేది విద్యార్దులే నిర్ణయించుకోవాలని తెలిపింది. 

ఐసీఎస్‌ఈ మాత్రం మళ్ళీ పరీక్షలు నిర్వహించదలచుకోలేదని, గత పరీక్షలు, అసెస్మెంట్ మార్క్స్ ఆధారంగా విద్యార్దులకు గ్రేడ్లు ఇచ్చి పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

రెండు బోర్డుల నిర్ణయాలను విన్న సుప్రీంకోర్టు విద్యార్దులకు గ్రేడ్లు ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నాయో అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. 

లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేక పాస్ చేస్తుండటంపై చాలా మంది విద్యార్దులు, వారి తల్లితండ్రులు కూడా సంతోషిస్తున్నారు. కానీ దీని వలన మెరిట్ విద్యార్దులు తాము నష్టపోయామని బాధపడుతున్నారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలనుకొంటే, లాక్‌డౌన్‌ కారణంగా ఆ అవకాశం లేక అందరితోపాటు తాము కూడా ప్రమోట్ చేయబడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ దేశమంతటా కరోనా మహమ్మారి విస్తరించి ఉండగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్దులందరికీ ప్రమాదం కనుక ఈ బ్యాచ్ విద్యార్దులు సర్దుకుపోక తప్పదు.         


Related Post