వనపర్తిలో దారుణం

April 19, 2019
img

వనపర్తి పట్టణంలోని పిఎస్ సిందూజ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్ది అల్లరి చేస్తున్నాడంటూ స్కూల్ కరస్పాండెంట్ చితకబాదాడు. చిన్నపిల్లాడని కూడా చూడకుండా విచిక్షణారహితంగా కొట్టడంతో వంశీ సొమ్మసిల్లిపడిపోయాడు. విషయం తెలుసుకొన్న అతని తల్లితండ్రులు, బందువులు అక్కడకు చేరుకొని ఆందోళన చేసిన తరువాత స్కూలు యాజమాన్యం వంశీని వారికి అప్పజెప్పింది. వంశీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించిన వారు అతనిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు వారు వెంటనే ఆ బాలుడిని హైదరాబాద్‌ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే బాలుడు మృతి చెందాడు. కరస్పాండెంట్ కొట్టిన దెబ్బలకు బాలుడి నరాలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయిన కారణంగా చనిపోయినట్లు సమాచారం. 

కళ్ల ముందే ఆ బాలుడు చనిపోవడంతో అతని తల్లితండ్రులు, బందువులు, వనపర్తి ప్రజలు ఆ బాలుడి శవంతో పాఠశాల వద్దకు చేరుకొని ధర్నా చేశారు. విద్యాశాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సిందూజా పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని బాలుడి తల్లితండ్రులకు, బందువులకు నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ కరస్పాండెంట్ తమవద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి నష్టపరిహారంగా రూ.10 లక్షలు ఇస్తేనే అక్కడి నుంచి కదులుతామని వారు పట్టుబట్టడంతో చివరికి కరస్పాండెంట్ వచ్చి క్షమాపనలు చెప్పి 10 లక్షల చెక్ ఇవ్వక తప్పలేదు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ప్రపంచంలో మానవులందరికీ మొదటి గురువులు తల్లి, తండ్రులైతే రెండవ గురువు ఉపాద్యాయులే. వారి జీవితాలను తీర్చిదిద్దవలసిన ఆ గురువులే ఇంత కర్కశంగా వారి ప్రాణాలు బలిగొంటుంటే ఆ విద్యార్దులకు ఇంక ఎవరు దిక్కు?

Related Post