నిరుద్యోగ భృతికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి?

February 23, 2019
img

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లింపులకు ప్రభుత్వం రూ.1,810 కోట్లు కేటాయించింది. కనుక త్వరలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ నిరుద్యోగులను ఏవిధంగా గుర్తించాలి? వారికి ఏ ప్రాతిపదికన చెల్లించాలనేదానిపై అధికారులలో ఇంకా స్పష్టత రాలేదు. కార్మిక, ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారం ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ కార్యాలయాలలో 13.65 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేయించుకొన్నారు. కానీ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు నేరుగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లలో వన్-టైమ్-రిజిస్ట్రేషన్ (ఓటీఆర్‌) చేసుకొంటున్నారు. ఆవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారి సంఖ్య సుమారు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. కనుక వారిలో ఎంతమందికి నిరుద్యోగ భృతికి అర్హులు? అనే విషయం అధికారులు తేల్చవలసి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ లో పేర్లు నమోదు చేసుకొన్నవారిని ఈ పధకానికి అర్హులుగా గుర్తించాలనే ప్రతిపాదనపై అధికారులు చర్చిస్తున్నారు. ఒకవేళ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ లో పేర్లు నమోదు చేసుకొన్నవారికి మాత్రమే నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిలో పేర్లు నమోదు చేసుకొన్న 13.65 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,016లు లభిస్తుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ లో పేర్లను నమోదు చేసుకొనే అవకాశం ఉంది కనుక రాష్ట్రంలో నిరుద్యోగులు తక్షణం తమపేర్లను నమోదు చేయించుకోవడం మంచిది. ఈ సొమ్ము లభిస్తే వారికి చాలా ఉపయోగపడుతుంది.   


Related Post