నిరుద్యోగులతో ఆటలా?

October 27, 2018
img

హైదరాబాద్‌లో జాబ్ మేళా జరుగుతోందంటే ఎక్కడెక్కడి నుంచో నిరుద్యోగులు ఆశతో వస్తుంటారు. నాంపల్లి  ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో 365 బహుళజాతి కంపెనీలు పాల్గొనబోతున్నాయని, అన్ని రంగాలకు చెందిన సుమారు 35,000 పోస్టులను భర్తీ చేసుకోబోతున్నాయని దాని నిర్వాహకులు ‘ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కాం’ చాలా విస్తృతంగా ప్రచారం చేయడంతో దూరప్రాంతాల నుంచి వేలాదిమంది నిరుద్యోగులు తరలివచ్చారు. కానీ కొన్ని చిన్న చిన్న కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఆఫీస్ బాయ్స్, సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో, జాబ్ మేళాకు వచ్చిన యువత ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దాంతో వారు అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీలను విరగొట్టి ద్వంసం చేశారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడకు చేరుకొని నిరుద్యోగ యువతను సముదాయించి వెనక్కు తిప్పి పంపేశారు. తరువాత జాబ్ మేళా గురించి అసత్య ప్రచారం చేసినందుకు ఆ సంస్థ ప్రతినిధి బి.వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు.

 నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతుంటే, తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగభృతి ఇస్తామని ప్రతిపక్ష పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అది చూసి అధికార పార్టీ కూడా ప్రతిపక్షం కంటే మరో రూ.16 ఎక్కువే ఇస్తామని హామీ ఇస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులతో ఒకవిధంగా ఆడుకొంటుంటే, కొన్ని ప్రైవేట్ సంస్థలు మరోవిధంగా ఆడుకొంటున్నాయి.

Related Post