హైకోర్టులో పంచాయితీ!

October 23, 2018
img

రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పాలన చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. బీసీ ఓటర్ల జాబితాలు సిద్దం చేసి మూడు నెలలలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

తాజాగా గ్రామ పంచాయితీలలో జూనియర్ కార్యదర్శుల నియామకాలపై  తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సీహెచ్‌ శ్రీనివాస్‌ ఒక పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పోస్టుల భర్తీకి జరిగిన పరీక్షల ఫలితాలకు బ్రేక్ పడింది. ఈనెల 30 వరకు ఆ పరీక్షా ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయితీలలో చిరకాలంగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని ఆ ఉద్యోగాలలోకి తీసుకోవాలని కోరుతూ సీహెచ్‌ శ్రీనివాస్‌ పిటిషన్ దాఖలు చేశారు.     

జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అన్ని వర్గాలకు కలిపి మొత్తం 9,355 పోస్టులు భర్తీకి పరీక్షలు జరిగాయి. ఈనెల 18లోగా ఫలితాలు వెలువడతాయని ఆశగా ఎదురుచూస్తుంటే, హైకోర్టులో పిటిషను దాఖలవడం, దానిని విచారణకు స్వీకరించి 30వరకు ఫలితాలు నిలిపివేయడంతో పరీక్షలకు హాజరైన వారందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Related Post