రిజర్వేషన్లపై హైకోర్టు తాజా తీర్పు

August 08, 2018
img

రెండు తెలుగు రాష్ట్రాలలో మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బిసి అన్ని వర్గాలకు కలిపి 50 శాతం కంటే రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మూడు కేటగిరీలలో విద్యార్ధులు ఒకవేళ ఓపెన్ కేటగిరీలో వేరే కళాశాలలో సీటు సంపాదించుకొన్నట్లయితే అప్పుడు వారు వదులుకొన్న రిజర్వ్ కేటగిరీలో సీటును మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాకాక వారు వదులుకొన్న రిజర్వ్ కేటగిరీలో సీటును మళ్ళీ అదే కేటగిరీ విద్యార్ధులకు కేటాయించినట్లయితే, అప్పుడు రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించిపోతుందని అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దమని పేర్కొంది. ఆవిధంగా సీట్లు కేటాయించేందుకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001 జులై 30న జారీ చేసిన జీవో నెంబర్: 550లో 5(2) పేరాను హైకోర్టు రద్దు చేసింది. ఇప్పటి నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రామసుబ్రహ్మణియన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు సమంజసంగానే ఉందని చెప్పక తప్పదు. ఎస్సీ, ఎస్టీ, బిసి కేటగిరీలకు చెందిన విద్యార్ధులు ఓపెన్ కేటగిరీలో ఒక మెరిట్ సీటును తీసుకొన్నప్పుడు ఓపెన్ కేటగిరీలో ఒక సీటు తగ్గిపోతుంది. కనుక సదరు విద్యార్ధి ఖాళీ చేసిన సీటును ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం సమంజసమే. 


Related Post