డిఎస్సి-1998 కేసులో ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు

July 24, 2018
img

డిఎస్సి-1998. అంటే రెండు దశాబ్దాల క్రితంనాటి వ్యవహారం. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు, అనేకమంది ముఖ్యమంత్రులు మారారు. చివరికి రాష్ట్రం కూడా రెండుగా విడిపోయింది కానీ నేటికీ డిఎస్సి-1998 మెరిట్ అభ్యర్ధులకు న్యాయం జరుగలేదు. రెండు దశాబ్దాలుగా ఈ కేసు న్యాయస్థానాలలో పడి ఉండటంతో వారిలో అనేకమందికి వయసు మీరిపోగా కొందరికి పదవీ విరమణ వయసు కూడా వచ్చేసింది. రెండు దశాబ్దాలనాటి ఆ కేసుపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగినప్పుడు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిఎస్సి-1998 మెరిట్ జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్ధులు 1999లో కేసు వేశారు. దానిపై 10 ఏళ్ళపాటు సుదీర్గ విచారణ జరిపిన హైకోర్టు 2009లో తీర్పు వెలువరించింది. మెరిట్ ఆధారంగా అభ్యర్ధులకు నియామక పత్రాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ గత 15 ఏళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపధ్యంలో విద్యాశాఖ అధికారులు హైకోర్టు తీర్పును అమలుచేయలేదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం దీనిపై 2016లో సుప్రీంకోర్టుకు వెళ్ళి డిఎస్సి-1998మెరిట్ అభ్యర్ధుల జాబితాను సమర్పించింది.      

ఈ కేసుపై హైకోర్టు నిన్న విచారణ జరిపినప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సంజీవ్ కుమార్, తమ ప్రభుత్వం వద్ద మెరిట్ అభ్యర్ధుల రికార్డులు లేనందునే కోర్టు ఆదేశాలను అమలుచేయలేకపోతున్నామని చెప్పడంతో న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు రికార్డులు సమర్పించిన ప్రభుత్వం తన వద్ద ఆ జాబితాలేదని చెప్పడానికి అర్ధం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులో కుంటిసాకులు చెపుతూ కోర్టు తీర్పు అమలుచేయకుండా ఆలస్యం చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ అధికారులను కోర్టుధిక్కార నేరం క్రింద జైలుకు పంపవలసివస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఆరోజు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ రోజు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ స్వయంగా హాజరవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆయన ఈకేసులో సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోతే, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిని కోర్టుకు పిలిపించవలసివస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు.


Related Post