జె.ఎన్.టి.యు.లో నేడు జాబ్ మేళా

July 07, 2018
img

కూకట్ పల్లి జె.ఎన్.టి.యు.లో నేడు జాబ్ మేళా జరుగబోతోంది. ఈ మేళాలో అనేక చిన్నాపెద్ద సంస్థలు పాల్గొని వివిధరకాల ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపికచేసుకోబోతున్నాయి. జె.ఎన్.టి.యు.లో అడ్మిషన్ బ్లాకులోని యు.ఐ.సి.సి.లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా ఉంటుంది.ఈ జాబ్ మేళా రేపు ఆదివారం కూడా నిర్వహించబోతున్నట్లు యు.ఐ.సి.సి. డైరెక్టర్ సిహెచ్.వెంకట రమణారెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 20 సంస్థలు పాల్గొని 3,500 ఉద్యోగాలు భర్తీ చేసుకోబోతున్నట్లు తెలిపారు.  

దీనిలో డిగ్రీ, డిప్లొమా, బి.టెక్, ఎం.టెక్, ఎం.సి.ఏ., ఎం.బి.ఏ., తదితర కోర్సులు చేసిన విద్యార్ధులు పాల్గొనవచ్చు. టెక్-మహేంద్రా, రాయల్ ఎన్ఫీల్డ్, వెస్పా, హెచ్.డి.ఎఫ్.సి., జి.ఎస్.పి., ఐసిఐసిఐ, కార్వీ, ఎంఐ, ఎయిర్ టెల్, వర్ టెక్స్, ఐజిఎస్, పిబిఎస్ఎస్, ఇన్ఫో ఈ-సెర్చ్ తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచినవారు ముందుగా జె.ఎన్.టి.యు వెబ్ సైటులో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోలేకపోయిన అభ్యర్ధులు కూడా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. అక్కడే తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్ధులు అందరూ విధిగా తమ అన్ని సర్టిఫికేట్లు, వాటి జిరాక్స్ కాపీలు, పాస్-పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు వగైరాలు వెంట తీసుకెళ్ళడం మరిచిపోకూడదు. రాయల్ ఎన్ఫీల్డ్, వెస్పా వంటి ఆటోమొబైల్ సంస్థలు, హెచ్.డి.ఎఫ్.సి., ఐసిఐసిఐ వంటి బ్యాంకింగ్ సంస్థలు, టెలికాం, సాఫ్ట్ వేర్ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి కనుక వివిధరంగాలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కనుక నిరుద్యోగయువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Related Post