నీట్ గా ఆత్మహత్య!

June 05, 2018
img

ఒకవైపు నీట్ ఫలితాలలో తెలంగాణా రాష్ట్ర విద్యార్ధి రోహన్ పురోహిత్ ఆల్-ఇండియా నెంబర్: 2 ర్యాంక్ సాధించిన వార్తలు ఇంకా మీడియాలో వస్తుండగానే, మరోవైపు నీట్ లో ర్యాంక్ సాధించలేకపోయినందుకు కాచిగూడకు చెందిన ఒక 18 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకొంది.  

ఆమె మంగళవారం ఉదయం నగరంలోని అబీడ్స్ జంక్షన్ వద్ద గల మయూరీ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకొంది. నీట్ లో ర్యాంక్ సాధించలేకపోయినందుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొన్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఆమె ఆ భవనంలోకి ప్రవేశించినప్పటి నుంచి క్రిందకు దూకుతున్నప్పటి వరకు సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని ఆమె జేబులో లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా ఈవిషయం గురించి ఆమె తల్లితండ్రులకు తెలియజేశారు. పోలీసులు ఆమె శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. 

చదువులు జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులలో ఏమాత్రం రాణించలేనివారు అనేకమంది ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. చదువులు మనిషికి విజ్ఞానం, లోకజ్ఞానం ప్రసాదించడానికే తప్ప జీవితాన్ని కబళించేవికావు. కానీ పెద్దలు, ఉపాద్యాయుల విపరీతమైన ఒత్తిడి కారణంగా ఈవిధంగా విద్యార్ధులు ఇంకా జీవితం ప్రారంభించక మునుపే అర్దాంతరంగా ముగించి కన్నవారికి తీరనిశోకం మిగిల్చివెళ్ళిపోతున్నారు.

Related Post