జగన్‌ కూడా కేసీఆర్‌కు దూరం జరుగుతున్నారా?

May 15, 2019


img

ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములు ఎవరెవరంటే తెరాస, వైకాపాలని టక్కున చెప్పవచ్చు. కానీ ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్‌కు దూరం జరుగుతున్నారా?అంటే అవుననే చెపుతోంది సాక్షి మీడియాలో నేడు ప్రచురితమైన విమర్శనాత్మకమైన కధనం. సాక్షి మీడియా చంద్రబాబునాయుడును విమర్శించడం ఎప్పుడూ ఉండేదే కానీ ఈసారి సిఎం కేసీఆర్‌పై కూడా బాణాలు ఎక్కుపెట్టడం చూస్తే జగన్‌ కూడా కేసీఆర్‌కు దూరం జరుగుతున్నారనే అభిప్రాయం కలుగకమానదు. 

ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ‘ఇరువురు చంద్రులూ చింతాక్రాంతులే’ అనే పేరుతో వ్రాసిన ఆ కధనంలో నిన్న మొన్నటిదాకా మోడీకి వీరభక్తులుగా ఉన్న ఇద్దరు చంద్రులు హటాత్తుగా మోడీని గద్దె దించేందుకు పావులు కడుపుతున్నారని మొదలుపెట్టి, షరా మామూలుగా చంద్రబాబుపై కొన్ని విమర్శలు గుప్పించినా తరువాత సిఎం కేసీఆర్‌పై బాణాలు గురిపెట్టారు. 

సునాయాసంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్లు పొందే సిఎం కేసీఆర్‌, లోక్‌సభ ఎన్నికలలో 16-17 ఎంపీ సీట్లు గెలుచుకొని మోడీ పంచనచేరి డిల్లీలో స్థిరపడి, తన ముఖ్యమంత్రి కుర్చీలో కొడుకును కూర్చోబెట్టాలనుకొన్నారని కానీ తనతో సహా తెరాస నేతలకు ఆదాయపన్ను నోటీసులు అందడంతో మోడీకి దూరం జరుగుతున్నారని వ్రాశారు. కూటమి ఏర్పాటు పోటీలో చంద్రబాబునాయుడు కంటే తాను వెనకబడిపోతున్నాననే ఆందోళనతో సిఎం కేసీఆర్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్, జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ను వెంటపెట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లు తిరుగుతున్నారని వ్రాశారు. చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ కూటమిలో చేరాలంటే ఒక సమస్య... చేరకపోతే మరో సమస్య అని కేసీఆర్‌ బాధ పడుతున్నారని వ్రాశారు. లోక్‌సభ ఫలితాల తరువాత ఏదో విధంగా డిల్లీకి షిఫ్ట్ అవలేకపోతే కొడుకు కేటీఆర్‌కు తన రాజ్యాన్ని (రాష్ట్రాన్ని) అప్పగించి ఢిల్లీలో కాళ్ళు ఊపుకుంటూ కాలక్షేపం చెయ్యడం ఎలా? అని కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారని దేవులపల్లి అమర్ వ్రాశారు.

లోక్‌సభ ఫలితాలు వెలువడక మునుపే ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఎంత ఆందోళన చెందితే ఏమి ప్రయోజనం? కనీసం ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూస్తే బాగుంటుంది కదా? అంటూ ముగించారు.


Related Post