కొత్త యాప్స్ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారా... తస్మాత్ జాగ్రత్త!

September 14, 2025
img

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని కొత్తకొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వాటిని అందించేందుకు లక్షలాది కొత్త మొబైల్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. 

ఏఐ టెక్నాలజీ చేస్తున్న ఈ అద్భుతాలు చూసి ప్రజలు కూడా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ దాని మోజులో పడుతున్నారు. వివిధ ఏఐ మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. దీని కోసం తమ ఫోటోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు వాటికీ అందిస్తున్నారు. 

జనాలకు ఏర్పడిన ఈ కొత్తమోజే సైబర్ నేరగాళ్ళు దోచుకునేందుకు మార్గం సుగమం చేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో ప్రజలు తమ పాత ఫోటోలను, చిన్నప్పటి ఫోటోలను, అలాగే తాజాగా తీసుకున్న ఫోటోలు, వీడియోలను వీటిలో అప్‌లోడ్‌ చేసి రకరకాలుగా మార్చుకుంటున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఇలాగే తన ఫోటోలను మార్చుకోవాలనుకోని సోషల్ మీడియాలో కనిపించిన ఇమేజ్ ఎడిటర్ యాప్‌ని తన మొబైల్ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. 

దానిలో సూచించిన విదంగా వరుసగా లింక్స్ క్లిక్ చేస్తూ తన ఫోటోని త్రీడీలోకి మార్చుకున్నాడు. కానీ అదే ఫోన్‌లో ద్వారా అతను ఆన్‌లైన్‌లో బ్యాంక్ లావాదేవీలు కూడా చేస్తుంటాడు. 

అతను ఫోటో మార్చుకునే ప్రయత్నంలో సదరు యాప్‌లో సూచించిన విదంగా వరుసగా లింక్స్ క్లిక్స్ చేసేసరికి సైబర్ నేరగాళ్ళు అతని అకౌంట్‌లో నుంచి రూ.70,000 కొట్టేశారు. ఈ విషయం తెలిసి లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

సైబర్ నేరగాళ్ళు ఈవిదంగా రకరకాల యాప్స్ క్రియేట్ చేస్తూ ప్రజల బ్యాంక్ అకౌంట్లు లేదా వ్యక్తిగత డేటాని హ్యాక్ చేసేందుకు వాటిలో చాలా సాధారణంగా కనిపించేలా లింక్స్‌ జోడిస్తున్నారు. ఉదాహరణకి ఫోటోని క్రాప్ చేయడం, వేరేవారికి షేర్ చేయడానికి ఫలానా బటన్ నొక్కమని వాటిలో ఉంటుంది. 

ఆ బటన్స్ వెనుక రహస్యంగా ప్రమాదకరమైన ఇటువంటి లింక్స్ ఉంటాయి. బటన్ నొక్కగానే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. లేదా ఫోన్లో పూర్తి సమాచారం అంతా సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కనుక ఏఐ మాయలో పడి మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

Related Post