హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో గత మూడు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నేడు కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనుక ఆయా జిల్లాల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉనాలని వాతావరణ శాఖ సూచించింది. నిన్న ములుగు జిల్లా వెంకటాపురంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భూపాలపల్లి మహాదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణీ సంగమం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తూ పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ పడి మీటర్ల ఎత్తున ప్రవహించింది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది.
నాగార్జున సాగర్‌లో కూడా నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం 2,09,794 క్యూసెక్కుల నీరు దిగువకు విదిచిపెడుతున్నారు. శ్రీశైలం ఏడు గేట్లను కూడా ఎత్తి స్పిల్ వే ద్వారా నాగార్జున సాగర్‌లోకి 1,93,634 నీటిని విడుదల చేస్తున్నారు.