రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే డిసెంబర్ 4న విడుదలైన పుష్ప-2 మొత్తం గేమ్ చేంజ్ చేసేసింది. ఆ స్థాయి సినిమాల ప్రమోషన్స్ ఏ విదంగా, ఏ స్థాయిలో ఉండాలో చూపించి, అందరూ ఆ దిశలో ఆలోచించేలా చేసింది.
గేమ్ చేంజర్ కూడా ఆ స్థాయిలోనే అయోధ్య నుంచి ప్రయాణం ప్రారంభించినా, ఇప్పుడు గేమ్ చేంజర్ నిజంగా గేమ్ చేంజర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ పుష్ప-2 స్థాయిలో లేదా అంత కంటే ఘనంగా నిర్వహించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రూ.1,000 కోట్లకుపైగా పుష్ప-2 కలెక్షన్స్ రికార్డ్స్ అధిగమించాల్సి ఉంటుంది. అదీ.. అడ్వాన్స్ బుకింగ్ మొదలు, ఫస్ట్-డే, ఫస్ట్-వీక్ వగైరా కలెక్షన్స్ రికార్డులను గేమ్ చేంజర్ అధిగమించాల్సి ఉంటుంది.
గేమ్ చేంజర్‌కు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం ఖాయమే కానీ ఇక సంధ్య థియేటర్ ఘటనని దృష్టిలో పెట్టుకొని గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలను అనుమతించకపోవచ్చు.
ఆ రెండు బెనిఫిట్ షోలతోనే పుష్ప-2 కలెక్షన్స్ రికార్డుల మోత మొదలైందని అందరికీ తెలుసు. గేమ్ చేంజర్‌కి బహుశః ఆ అవకాశం లేకుండా పోతుంది కనుక గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పుష్ప-2కి మించి నిర్వహించడం చాలా అవసరంగా మారింది. మరి గేమ్ చేంజర్ దర్శక నిర్మాతలు అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారో లేదో త్వరలోనే తెలుస్తుంది.
రామ్ చరణ్-శంకర్ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అని పేరు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమాతో సహా సినీ పరిశ్రమ, ప్రభుత్వాల ఆలోచనా ధోరణి కూడా పుష్ప-2 మార్చేసింది కనుక పుష్ప-2యే గేమ్ చేంజర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. కాదని నిరూపించాల్సిన బాధ్యత గేమ్ చేంజర్ మీదే ఉంది.