ఆదివారం చెన్నైలోని పుష్ప-2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ముందే చెప్పుకున్నట్లు ఈ పాట, సంగీతం, డ్యాన్స్ అన్నిటినీ పుష్ప-1లో ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.. ‘ పాట, దాని సంగీతం, దానికి సమంత చేసిన డ్యాన్స్‌తో పోల్చి చూస్తే, కిస్సిక్.. పాట అంత గొప్పగా అనిపించలేదనిపిస్తుంది.
పాట లిరిక్స్ వింటున్నప్పుడు ఇదివరకు ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ‘బాస్ వస్తుండు నువ్వు చొక్కా వేస్కొ.. నువ్వు కర్చీఫ్ వేస్కొ..’ అంటూ సాగే పాట లిరిక్స్ గుర్తొస్తాయి. కనుక పాట లిరిక్స్, సంగీతం పక్కన పెట్టి చూసిననట్లయితే అల్లు అర్జున్, శ్రీలీల చేసిన డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది.
ఇక వేదికపైనే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత రవిశంకర్‌ని ఉద్దేశించి “నేను సమయానికి పాట ఇవ్వలేదు, సంగీతం ఇవ్వలేదు. టైముకి రాడు.. అంటూ మీకు నామీద చాలా పిర్యాదులున్నాయి. నా మీద మీకు చాలా ప్రేముందని తెలుసు. ప్రేమ కంటే నామీద పిర్యాదులే ఎక్కువున్నాయి. ఇప్పుడు కూడా కిస్సిక్ పాట రన్ అవుతున్నప్పుడు ఆలస్యంగా వచ్చానని ‘రాంగ్ టైమింగ్’ అనేశారు. నన్ను లోపలకి రానీయకపోతే నేనేం చేయను సార్? ఇవన్నీ వేరేగా అడిగితే పెద్ద కిక్కు ఉండదని వేదిక మీద నుంచే అడిగేస్తున్నాను,” అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సమయానికి సంగీతం, పాటలు అందించకపోవడం వల్లనే తమన్‌ని కూడా తీసుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ బాధ పడిన్నట్లు ఆయన మాటలతో అర్దమవుతూనే ఉంది.
అలాగే మనకి రావలసింది ఏదైనా అడిగి తీసుకోవాలసిందే. అడగందే ఏదీ లభించదు.. అది నిర్మాత దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద మన క్రెడిట్స్ అయినా..” అంటూ దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు నిర్మాతతో ఏదో సమస్య ఉందని సూచిస్తున్నాయి.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు, ఇటువంటి వివాదాలు మంచిది కాదు. కానీ ఒక్కోసారి ఇటువంటి వివాదాలే సినిమాకి హైప్ క్రియేట్ చేస్తుంటాయి కూడా.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం: సుకుమార్, కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు. పుష్ప-2 విదేశాలలో డిసెంబర్ 4న, భారత్‌లో మర్నాడు అంటే డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.