కల్కి ఎడి2898... ఇండియన్ హాలీవుడ్ మూవీ

June 27, 2024
img

రాజమౌళి సినిమాల తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అంతగా ఎదురుచూసిన ఏకైక సినిమా కల్కి ఎడి2898 అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు సినీ విశ్లేషకులు అందరూ చక్కటి రేటింగ్ ఇవ్వగా, సినిమా చూసిన ప్రేక్షకులు నూటికి నూరు మార్కులు ఇస్తున్నారు.

సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని అందరూ చెప్పుకోవడమే కానీ అదేమిటో తొలిసారిగా కల్కి ఎడి2898తో చూశామని చెపుతున్నారు. 

దర్శకుడు నాగ్ అశ్విన్‌ హిందూ ఇతిహాసాలను, భవిష్యత్‌ ప్రపంచాన్ని జోడించి వ్రాసుకున్న కధ చాలా అద్భుతంగా ఉందని, దానిని తెరపై ఇంకా గొప్పగా ఆవిష్కరించారని సినిమాని చూసిన ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

ఇంతకాలం హాలీవుడ్ మాత్రమే ఇటువంటి సినిమాలు చూపగలిగేది కానీ తొలిసారిగా నాగ్ అశ్విన్‌ అంతకంటే అద్భుతంగా సినిమా తీసి చూపారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. 

సాధారణంగా హీరో ఎలివేషన్స్ తప్పనిసరి అనే ఫార్ములాని కూడా నాగ్ అశ్విన్‌ బ్రేక్ చేసి, ప్రభాస్‌ని పరిచయం చేసిన తీరు, క్లైమాక్స్ చేరుకునేసరికి ప్రభాస్‌ని ఎలివేట్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కి కూడా హీరోతో సమానంగా ప్రాధాన్యం ఇస్తూ కధ నడిపించిన తీరు చాలా గొప్పగా ఉందని మెచ్చుకుంటున్నారు. కురుక్షేత్ర యుద్ధం, కలియుగం, మూడు రకాల ప్రపంచాలు, వాటి మద్య పోరాటాలు, గ్రాఫిక్స్, విజువల్స్, మ్యూజిక్ ప్రతీ ఒక్కటీ ఓ అద్భుతమే అని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. 

ఎవరూ ఊహించని విదంగా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్ సల్మాన్ పేర్లతో పాత్రలు సృష్టించి, మళ్ళీ వాటిని ఎక్కువ సాగదీయకుండా ముగించేసి అలరించడాన్ని ప్రేక్షకులు చాలా మెచ్చుకుంటున్నారు. 

కల్కి ఎడి2898 సినిమాలో అక్కడక్కడ కాస్త సాగదీసిన్నట్లు అనిపించినా, ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా కధలో లీనమయ్యేలా చేయడం బాగుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కనుక తెలుగు సినీ పరిశ్రమకు మరో గొప్ప దర్శకుడు దొరికిన్నట్లే.

Related Post