బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్‌లో పెద్ది సినిమా గురించి విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “పెద్ది 50 శాతం షూటింగ్ పూర్తయింది. ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదలవుతుంది,” అని చెప్పారు.
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన ‘గేమ్ చేంజర్’ తీవ్ర నిరాశ పరచడంతో అభిమానులు పెద్ది కోసం ఎదురుచూస్తున్నారు. క్రికెట్ ఆట నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాలో పెద్దిగా నటిస్తున్న రామ్ చరణ్ బరిలో దిగుతూనే ‘సిగ్నేచర్ షాట్’తో అభిమానులని అలరించారు. ఆ ఒక్క షాట్‌తోనే ‘పెద్ది’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇటీవలే మైసూరు వెళ్ళి అక్కడ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొన్నారు. జానీ మాస్టర్ దీనికి నృత్య దర్శకత్వం చేశారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడుగా నటిస్తుంటే, ఆయనకు కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.