మహేష్-త్రివిక్రమ్ సినిమా పేరు అసుర సంద్యవేళ?

December 01, 2022


img

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో మొదలైన సినిమా షూటింగ్ కృష్ణ ఆకస్మిక మృతితో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మహేష్ బాబుకి స్టంట్ మాస్టర్స్ అంబు, అన్విలతో విబేధాలు కూడా తలెత్తిన్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరినీ మార్చాలని మహేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది. మళ్ళీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ నెల 8వ తేదీ నుంచి మొదలవబోతోంది. 

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు “అసుర సంధ్యవేళ” అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

త్రివిక్రం శ్రీనివాస్‌కి సినిమా టైటిల్స్ విషయంలో ఉన్న ‘ఆ’ సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమా పేర్లన్నీ అ, ఆ అక్షరాలతోనే మొదలయ్యాయి. అ ఆ, అతడు, అత్తారింటికి దారేది?, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలలో ఒక్క అజ్ఞాతవాసి తప్ప అన్నీ సూపర్ హిట్లే. అంతకు ముందు నువ్వే నువ్వే, జల్సా, ఖలేజా, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు కూడా చేసినప్పటికీ అ ఆ నుంచి 'అ' అక్షరానికి ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. కనుక ఈ సినిమాకి కూడా అ అక్షరంతోనే "అసుర సంధ్య వేళ"  అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఇంకా ధృవీకరించవలసి ఉంది 

ఈ సినిమాకి ‘అసుర సంద్య వేళ’ అని టైటిల్‌ ఖరారు చేయడం నిజమైతే, దీని వెనుక ఉన్న పౌరాణిక కధ గురించి క్లుప్తంగా చెప్పుకోక తప్పదు. భక్త ప్రహ్లాదుడు మొర ఆలకించిన విష్ణుమూర్తి నరసింహావతారంలో అసుర సంద్య వేళ స్తంభం చీల్చుకొని వచ్చి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. కనుక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు ఒకరి సాయంతో ‘రాక్షస సంహారం’ అంటే విలన్లను అంతం చేస్తాడని భావించవచ్చు. అంటే యాక్షన్ మూవీ అని భావించవచ్చు. 

ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష