మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు: వేణు ఉడుగుల

April 12, 2026


img

మైక్రో ఫైనాన్సింగ్ కేసులో ప్రముఖ జానపద గాయని మంగ్లీపై సుబ్బారావు అనే ఓ లాయర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె కూడా ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఆయన చెపుతున్న ఆ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారం, నోట్ల కట్టలతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన నా ప్రతిష్టకు భంగం కలిగిస్తునందున నేను ముందే కేసు వేశాను,” అని చెప్పారు. ఈ ఇద్దరి వివాదంలో దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా వినిపించింది. 

దీంతో వేణు ఉడుగుల కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. “నాకు ఇరు వర్గాలతో పరిచయం ఉంది. కనుక ఈ సమస్యని కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించాను. ఇంతకు మించి నాకేమీ తెలియదు.

నేను ఎవరినీ ఫోన్లు చేసి బెదిరించలేదు. లాయర్ సుబ్బారావు కూడా ఇదే చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నాపేరు లేదు. కానీ కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా నాపై అపవాదులు వేస్తున్నారు.

కనుక దయచేసి నాది, నా కుటుంబానిది పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఎవరూ తప్పుడు వార్తలు ప్రచురించవద్దు,” అని వేణు ఉడుగుల విజ్ఞప్తి చేశారు. 

    



Related Post