మూడు రోజుల విరామం తర్వాత మళ్ళీ నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే కేసీఆర్ ఈసారి కూడా శాసనసభకు మొహం చాటేశారు. కనుక హాజరు కొరకే మొదటి రోజున శాసనసభకు వచ్చారని స్పష్టమైంది. శాసనసభలో ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని కనుక తప్పకుండా రావాలని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే చెప్పినా కేసీఆర్ రాలేదు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసనసభలో దడదడలాడించేద్దామని చెప్పిన కేసీఆర్ మొహం చాటేయడంతో కాంగ్రెస్ సభ్యుల ముందు బీఆర్ఎస్ సభ్యులు తల దించుకోవాల్సివస్తోంది. సమావేశాలకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు కూడా చాలా ఆక్షేపణీయంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దగా నినాదాలు చేస్తూ ఆటంకం కలిగిస్తున్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు మేము సమాధానం చెపుతాం. ప్రతీ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కనుక సమావేశానికి ఆటంకం కలిగించవచ్చు. ఒకవేళ వారు సమావేశంలో పాల్గొనకూడదని అనుకుంటున్నట్లయితే అదే మాట స్పీకరుకి చెపితే బాగుంటుంది,” అని అన్నారు.