పవన్‌ కళ్యాణ్‌ పిలిస్తే నేను ప్రచారానికి రెడీ: అనసూయ

March 28, 2024


img

ప్రముఖ నటి అనసూయ తాజా ఇంటర్వూలో తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదంటూనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలిస్తే ఆ పార్టీ తరపున ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పడం విశేషం.

తనకు పార్టీలు, వాటి అభ్యర్ధులను కాక ఆయా పార్టీల లీడర్లని మాత్రమే చూస్తానని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వం, ఆలోచనలు, ఆశయాలు తనకు బాగా నచ్చాయని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తన వంతుగా మేలు చేయాలని తపిస్తున్నారని అనసూయ అన్నారు. కనుక ఆయన పిలిస్తే తప్పకుండా జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అనసూయ చెప్పారు.

తాను చెప్పేది వినేందుకు ఆసక్తి చూపే ప్రజలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే దానిని ఓ అవకాశంగా కాక బాధ్యతగా భావిస్తున్నానని అనసూయ అన్నారు.

నటిగా అనసూయ ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో, ఆమె అందాల ప్రదర్శనతో అంతే చెడ్డ పేరు, విమర్శలు సంపాదించుకుంటున్నారని అందరికీ తెలుసు. కానీ ఆమె వాటిని ఖాతరు చేయకుండా నిబ్బరంగా తన పద్ధతిలోనే ముందుకు సాగుతున్నారు. ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ ఆమెను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తారో లేదో?


Related Post