కేసీఆర్‌ నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు: రఘునందన్ రావు

March 27, 2024


img

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం రోజుకొ మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు బుధవారం డిజిపి రవిగుప్తాని కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డి మీద ఫిర్యాదు చేశారు.

వారు అధికారంలో ఉన్నప్పుడూ తన ఫోన్, తన కుటుంబ సభ్యులా ఫోన్లు, పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్ధిపేటలోనే కేసీఆర్‌ వార్ రూమ్ ఏర్పాటు చేయించి అక్కడి నుంచే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని పిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని కనుక ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్‌, హరీష్ రావు, అప్పుడు సిద్ధిపేట జిల్లా కలెక్టరుగా ఉన్న వెంకట్రామి రెడ్డిలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు డిజిపి రవిగుప్తాని కోరారు.

అసలు ఈ పరికరాలను ఎక్కడి నుంచి తెప్పించారు? ఎలా తెప్పించారు? ఎవరి ఆదేశంతో తెప్పించారు? వాటితో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారో విచారణ జరిపి తెలుసుకొని, దోషులకు న్యాయస్థానంలో శిక్షలు పడేలా చేయాలని రఘునందన్ రావు కోరారు. 

అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నాన్చకుండా వీలైనంత త్వరగా విచారణ జరిపించాలి. వీలైతే ఈ కేసుని సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలి,” అని అన్నారు. 


Related Post