ఇకపై బిఆర్ఎస్ పార్టీతో సంబంధం మాకు లేదు: టిబిజీకేఎస్

March 27, 2024


img

బిఆర్ఎస్ పార్టీకి శాసనసభ ఎన్నికలలో ఓటమి చాలా నష్టం కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్ళిపోగా, ఇప్పుడు సింగరేణిలో బిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న టిబిజీకేఎస్ కూడా తెగతెంపులు చేసుకొంటున్నట్లు ప్రకటించింది. ఇకపై తమ కార్మిక సంఘం కూడా స్వతంత్ర సంఘంగా పని చేస్తుందని, బిఆర్ఎస్‌తో సహా  ఏ రాజకీయ పార్టీతో కలిసి పనిచేయదని కొత్తగా ఛైర్మన్‌గా ఎంపికైన రాజిరెడ్డి చెప్పారు. 

అయితే సింగరేణిలో కార్మికుడుగా పనిచేసి రాజకీయాలలోకి వెళ్ళి ఈసారి బిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌కు మాత్రం మద్దతు ఇస్తామని తెలిపారు. 

టిబిజీకేఎస్‌కు బిఆర్ఎస్‌ పార్టీతో 21 ఏళ్ళ అనుబంధం ఉంది. దానిని తెంచుకోవడానికి రెండు బలమైన కరణాలున్నాయి.

1. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలలో టిబిజీకేఎస్‌ని పోటీ చేయకుండా బిఆర్ఎస్‌ పార్టీ అడ్డుకోవడం. 2. టిబిజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుకి వెళ్ళడం. 

గుర్తింపు సంఘం ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకొన్నప్పుడే నిరసన తెలుపుతూ పలువురు సీనియర్ కార్మిక సంఘం నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు సంఘమే బిఆర్ఎస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకొని నూతన కమిటీని ఎన్నుకొంది. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు టిబిజీకేఎస్ బిఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. వరంగల్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి విస్తరించి ఉంది. 

అక్కడి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా బిఆర్ఎస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వారికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక టిబిజీకేఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. 


Related Post