ఇక పదో తరగతి, ఇంటర్‌కి ఓకే బోర్డు విద్యని రెండు వేర్వేరు బోర్డుల ద్వారా కాక ఓకే బోర్డు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఏపీ, తెలంగాణతో సహా దేశంలో 8 రాష్ట్రాలలో పదో తరగతికి, ఇంటర్‌కి వేర్వేరుగా బోర్డులున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఈ విధానం అమలుచేయాలని సూచించింది. పదో తరగతి బోర్డుని ఇంటర్ బోర్డులో విలీనం చేయాలని కేంద్రం సూచించింది.
ఈ అంశంపై చర్చించేందుకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఓకే రకమైన విద్యావిధానం ఉండటం చాలా అవసరమని, దీని వలన విద్యార్ధులకు చాలా మేలు జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ అధికారులు చెప్పారు.
ఓకే బోర్డు పరిధిలో 10, 11,12 తరగతులు ఉన్నట్లయితే ఓకే పాఠశాలలో, ఓకే విధానంలో విద్యా బోధన జరుగుతుంది కనుక 10 వ తరగతి తర్వాత విద్యార్ధులు మద్యలో చదువులు మానేయకుండా కనీసం 12వ తరగతి వరకు చదువుకుంటారు.
ఆ స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడితో చదువులు ముగించకుండా ఉన్నత విద్యలకు మొగ్గు చూపుతారు. పదో తరగతి, ఇంటర్ కొరకు వేర్వేరు బోర్డులు ఉండటం వలన అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక వాటిని విలీనం చేసి ఒకటే బోర్డు ఏర్పాటు చేస్తే మంచిదని కేంద్ర విద్యాశాఖ అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదన, దాని మంచి చెడులని తమ ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తారు. అందుకు వారు కూడా అంగీకరించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరంలోగా ఈ రెండు బోర్డుల విలీనం ప్రక్రియ పూర్తిచేసి, ఓకే విధానం అమలుచేసేందుకు విధివిధానాలు, ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.