ఉన్నత విద్యలభ్యసించి పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అనేక కారణాల వలన చాలా మంది విద్యార్దులకు అటువంటి అవకాశం లభించదు. అటువంటివారి కోసమే అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో చక్కటి ఉద్యోగావకాశాలు కలిగిన కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు ఐటిఐలు ఉన్నాయి. వాటిలో చేరేందుకు పదో తరగతి పాస్ అయితే చాలు. ఐటిఐలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటార్ మెకానిక్ వంటి అనేక కోర్సులలో శిక్షణ పొందితే ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఖమ్మం జిల్లా మధిరలో కొత్తగా ఐటిఈ ఏర్పాటుకి కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ శుక్రవారం జీవో జారీ చేశారు. దీని భవనాలు వగైరా నిర్మాణం కోసం రూ.11.37 కోట్లు, వీటిలో యంత్రాలు, అవసరమైన పరికరాలు వగైరాల కోసం మరో రూ.10.31 కోట్లు కేటాయించింది. ఇది అందుబాటులోకి వస్తే దీనిలో ఏటా 200 మంది విద్యార్దులు శిక్షణ పొందవచ్చు. ఈ ఐటిఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర కోర్సులతో పాటు కొత్తగా ఐవోటీ స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ తదితర కోర్సులు ఉంటాయి.
ఈ ఐటిఐ కోసం ప్రభుత్వం శాస్విత ప్రాతిపదికన ఒక ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, శిక్షణ కోసం ఇన్‌స్ట్రక్టర్స్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఐదుగురు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 26 పోస్టులు మంజూరు చేసింది. ఒక ఏడాదిలోగా ఈ ఐటిఐ నిర్మాణ పనులు పూర్తిచేసి శిక్షణ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.