గ్రూప్-1 విజేతల జాబితా విడుదల

September 25, 2025
img

గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో టిజిపీఎస్సీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంపిక అయిన అభ్యర్ధుల జాబితా బుధవారం అర్దరాత్రి విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులకి 562 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. మిగిలిన ఒక పోస్టుపై ఇంకా న్యాయ వివాదం నెలకొని ఉన్నందున విడుదల చేయలేదు. 

గ్రూప్-1లో మొదటి పది ర్యాంకులు సాధించిన అభ్యార్ధులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పు వెలువడగానే టిజిపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన బోర్డు సభ్యులు సమావేశమై తీర్పుపై లోతుగా చర్చించాక ఫలితాలు ప్రకటించారు.  

ఈ నియామకాలు హైకోర్టు తుది తీర్పుకి లోబడి ఉంటాయని ఎంపికైన అభ్యర్ధులు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే వారి నియామకాలను రద్దు చేస్తామని టిజిపీఎస్సీ స్పష్టం చేసింది.     

గ్రూప్-1లో ఈ పోస్టులకు టిజిపీఎస్సీ 2024 ఫిభ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసి అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు ప్రకటించగా దానిపై అభ్యంతరాలు తెలుపుతూ కొంతమంది అభ్యర్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. అందువల్లే నియామకాలలో ఇంత ఆలస్యమైంది. హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో టిజిపీఎస్సీ వెంటనే నియామక ప్రక్రియని ప్రారంభించింది.

హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌కు చెందిన లక్ష్మీ దీపిక  గ్రూప్-1లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్‌గా నిలిచారు. ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. 

Related Post