తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలని వాయిదా వేయాలంటూ ఓ పక్క కొందరు అభ్యర్ధులు హైదరాబాద్, అశోక్ నగర్ వద్ద ఆందోళనలు చేస్తుంటే పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. మరోపక్క సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యధాప్రకారం ఈ నెల 21నా నిర్వహించుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ పరీక్షని వాయిదా వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లని హైకోర్టు కొట్టివేసింది.
ఇంతకీ ఆందోళన చేస్తున్న అభ్యర్ధులకు దీనిపై అభ్యంతరాలు దేనికంటే, వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 వలన వికలాంగులకు అన్యాయం జరుగుతుందని, దాని ప్రకారం జనరల్ కేటగిరీలో అభ్యర్ధుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వికలాంగులను అన్ రిజర్వ్ కేటగిరీగా పరిగణించనున్నారు.
ప్రిలిమ్స్ లో ఎక్కువ మార్కులు సాధిస్తే అందుకు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అన్ రిజర్వ్ కేటగిరీగా పరిగణించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన వారికి 1.50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
కానీ వారి పిటిషన్లని హైకోర్టు కొట్టేసి 21న పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వారిలో కొందరు వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుని విచారణ చేపట్టేలోగా మెయిన్స్ జరిగిపోతే మార్పు చేయడం అసాధ్యమే.