ఇక ముసుగులో గుద్దులాటల్లేవ్...

November 14, 2017


img

తెరాస సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణా రైతు సమన్వయసమితిల ఏర్పాటుపై శాసనసభలో నిన్న జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ వాటి  గురించి తన మనసులో మాట కుండబద్దలు కొట్టినట్లుచెప్పేశారు. 

“ఆ కమిటీలలో ఇతర పార్టీల వాళ్ళకు అవకాశం లేదు. మా ప్రభుత్వ ఆశయాలను మా పార్టీ కార్యకర్తలైతేనే సక్రమంగా అమలుచేస్తారు తప్ప ఇతర పార్టీలవారు కాదు. అందుకే వాటిలో కేవలం తెరాస కార్యకర్తలే సభ్యులుగా ఉంటారు. తెలంగాణా పునర్నిర్మాణంలో చిత్తశుద్ధితో పాల్గొనే వారికే వాటిలో స్థానం ఉంటుంది తప్ప అడుగడుగునా తెలంగాణా అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలవారికి కాదు. తెరాసలో 56 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వారందరూ తెలంగాణా ప్రజలే కదా! అలాగే ఆ కమిటీలలో తెరాసకు చెందినవారైనంత మాత్రాన్న వారు రైతులు కాకుండాపోరు కదా! గత 14 ఏళ్ళుగా వాళ్ళందరూ నానా కష్టాలు పడ్డారు. కనుక ఇకనైనా వారందరికీ మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ కమిటీలను ఏర్పాటు చేశాము. వచ్చే ఏడాది నుంచి వారందరికీ ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8,000 చొప్పున అందించబోతున్నాము. ఒకవేళ మా నిర్ణయం తప్పయితే ప్రజాకోర్టులో శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉన్నాము,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ తన మనసులో మాటను విస్పష్టంగా చెప్పారు.

తెలంగాణా రైతు సమన్వయసమితిల ఏర్పాటు వెనుక అంతరార్ధం ఇదేనని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా దృవీకరించినందున ఇక ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న, ఇక ముందు అందించబోయే ప్రయోజనాలను అందుకోవాలంటే రైతులు అందరూ తప్పనిసరిగా తెరాస కండువాలు కప్పుకోక తప్పదని వేరే చెప్పనవసరం లేదు. కాదని కాంగ్రెస్ లేదా మరో పార్టీకి వంతపాడితే వారికి ఈ ఫలాలు అందే అవకాశం ఉండకపోవచ్చు. 

ఇదివరకు ప్రతిపక్షాల ముఖ్యనేతలను తెరాసలోకి ఫిరాయింపజేయడం ద్వారా వాటిని బలహీనపరిచారు. రాష్ట్రంలో ప్రజలను కూడా తెలంగాణా రైతు సమన్వయసమితిలు, బొగ్గుగని సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు...ఈవిధంగా వర్గాలవారిగా విభజించి మళ్ళీ వాటిని అధికార, ప్రతిపక్ష సంఘాలుగా విడదీసి మళ్ళీ వాటిలో కేవలం తెరాసకు అనుబంధంగా ఉన్నవాటికే ప్రయోజనాలను అందించడం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూడా తెరాస కార్యకర్తలుగా మార్చుకోవాలనుకోవడం గొప్ప రాజకీయ చతురతే కావచ్చు కానీ ప్రజల మద్య ఈవిధంగా విభజన రేఖలు గీసి, అందరూ గులాబీ కండువాలు కప్పుకొనేలా చేయాలనుకోవడం చాలా అనైతికమని చెప్పక తప్పదు. 

ప్రభుత్వం అంటే ఒక ధర్మకర్త వంటిది. ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటిపెద్దవంటివాడు. కనుక రాష్ట్రంలో ప్రజలందరినీ సమానదృష్టితో చూడాలి. అప్పుడే ప్రజలు కూడా మిగిలిన అన్ని పార్టీలను పక్కనపెట్టి తెరాసకె మళ్ళీ పట్టం కడతారు. గత ప్రభుత్వాలు కూడా ఇలాగే చేశాయని సమర్ధించుకోవడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.   


Related Post