కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

November 04, 2017


img

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏమిటంటే, తెలంగాణాలో అది కేవలం తెరాస సర్కార్ తో మాత్రమే పోరాటాలు చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో తెదేపా, భాజపా, వామపక్షాలు ఉన్నప్పటికీ అవన్నీ చాలా బలహీనంగా ఉన్నందున అది వాటితో కూడా రాజకీయ యుద్ధాలు చేయవలసిన బాధ తప్పింది. రాష్ట్ర భాజపా నేతలు కాంగ్రెస్ జోలికి రానందున కాంగ్రెస్ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ వచ్చి ఉండి ఉంటే  మోడీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నవారికి నోట్లరద్దు, జి.ఎస్.టి.అంశాలతో వాతలు పెట్టి ఉండేదేమో? కానీ జాతీయస్థాయిలో తమ పార్టీ భాజపాతో రాజకీయ యుద్ధం చేస్తోంది కనుక దానిలో రాష్ట్ర కాంగ్రెస్ కూడా అప్పుడప్పుడు పాల్గొనక తప్పడం లేదు. 

ప్రధాని నరేంద్ర మోడీ పాత పెద్దనోట్లను రద్దు చేసి నవంబర్ 8కి ఏడాది పూర్తవుతుంది కనుక ఆరోజున బ్లాక్-డేగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దం అవుతోంది. 

గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ పీఠంపై స్థిరపడిపోయిన భాజపాకు ఈసారి ఎన్నికలలో ఎదురుగాలి వీస్తోంది. కనుక ఈసారి భాజపాను ఎలాగైనా ఓడించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ అక్కడే తిష్ట వేసి చాలా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో భాజపాకు చాలా ఇబ్బందికరమైన ఈ నోట్లరద్దు అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి దానిని హైలట్ చేయడం ద్వారా గుజరాత్ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం సహజమే. కనుక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై కాస్త గట్టిగానే హడావుడి చేయవచ్చు. 


Related Post