సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ ఆలోచన

August 29, 2017


img

తెలంగాణా ఏర్పడకముందు రాష్ట్రంలో నదులు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు వగైరా అన్నీ ఉన్నాయి కానీ ఏనాడూ వ్యవసాయం సాఫీగా సాగిన దాఖలాలు లేవు. కారణాలు అందరికీ తెలుసు. తెలంగాణా భౌగోళిక పరిస్థితులు, రైతుల సమస్యలు, అవసరాలు, ప్రాజెక్టుల తీరుతెన్నుల గురించి మంచి అవగాహన, సమస్యలను పరిష్కరించి రైతులకు నీళ్ళు అందించాలనే తపన, చితశుద్ధి ఉన్న కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రైతుల అదృష్టమేనని చెప్పకతప్పదు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ ఊహించలేని విధంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టడం ఆయన దూరదృష్టికి మంచి నిదర్శనం. రాష్ట్రంలో గల 44,180 కు పైగా ఉన్న చిన్నా, పెద్ద, గొలుసుకట్టు చెరువులలో పూడిక తీసి వాటిని మంచినీళ్ళు నింపగలిగితే, పరిసర ప్రాంతాల రైతులకు సాగునీరు అందించవచ్చని, వాటితో భూగర్భ జలాలు పెరుగుతాయని, అప్పుడు ఎండిపోయిన బోరుబావులను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావచ్చని, అలాగే నీళ్ళు నిండిన ఆ చెరువులలో చేపపిల్లలను వదిలినట్లయితే మత్స్యకారులకు ఉపాధి కల్పించవచ్చని ఇదివరకు ఏ రాజకీయనేతకు ఆలోచన తట్టలేదు. 



కేసీఆర్ అధికారంలోకి రాగానే చేపట్టిన్న మిషన్ కాకతీయ ఆశించినట్లే సత్ఫలితాలు ఇస్తోందని మీడియాలో వస్తున్నవార్తలే చాటి చెపుతున్నాయి. గొప్ప ఆశయం, చిత్తశుద్ధితో ఏ పని చేపట్టినా భగవంతుడు కూడా ఆశీర్వదించి తోడ్పడతాడని పెద్దలు చెపుతుంటారు. దానిని రుజువు చేస్తున్నట్లుగా ఇటీవల కురుస్తున్న బారీ వర్షాలకు మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసినవాటిలో సుమారు 25 శాతం చెరువులలో నీళ్ళు నిండి కళకళలాడుతుంటే అది చూసి రైతుల మొహాలు కూడా ఆనందంతో వికసిస్తున్నాయి. 


ముఖ్యంగా గోదావరి బేసిన్ క్రిందనున్న 20,814 చెరువులలో 2,024 చెరువులలో ఈ బారీవర్షాల కారణంగా పూర్తిగా నిండాయి. వాటిలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో గల 612 చెరువులు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో గల 493 చెరువులు కట్టలు తెంచుకొని ప్రవహించే స్థాయికి చేరుకొన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 285 చెరువులు కూడా దాదాపు నిండిపోయాయి. 


అయితే ఎగువన కర్నాటక రాష్ట్రంలో ఇంకా పెద్దగా వానలు పడకపోవడం వలన కృష్ణా బేసిన్ క్రిందకు వచ్చే 23,366 చెరువులలో కేవలం 303 మాత్రమే నిండాయి. మరో 810 చెరువులలో దాదాపు 75-100 శాతం వరకు నిండాయి. అయితే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రానున్న రోజులలో అన్ని చెరువులలో నీళ్ళు నిండే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మిషన్ కాకతీయ మొదటి, రెండవ దశలలో రాష్ట్రంలో 17,000 చెరువులలో పూడిక తీయించింది. వాటిద్వారా సుమారు 19 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయిప్పుడు. మూడవ దశలో 6,230 చెరువులలో పూడిక తీసింది. మిషన్ కాకతీయ కార్యక్రమం పూర్తయ్యేసరికి కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది కనుక వాటి ద్వారా కూడా మిగిలిన చెరువులకు నీళ్ళు అందించడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ సాధించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. కేసీఆర్ సర్కార్ చేస్తున్న ఈ భగీరధ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని ఇప్పటికే నిరూపితం అవుతోంది. 




Related Post