ప్రైవసీ ప్రాధమిక హక్కే: సుప్రీంకోర్టు

August 24, 2017


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు పధకాలకు, మొబైల్ ఫోన్, గ్యాస్ కనెక్షన్ల కోసం, బ్యాంక్ అకౌంట్స్ తెరిచేందుకు ఇప్పుడు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది. ఈ కారణంగా ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ మార్కెట్లో అమ్ముడుపోయే సరుకుగా మారిపోయింది. కొందరు వ్యక్తులు ఆ వివరాలను వాణిజ్య సంస్థలకు టోకుగా అమ్ముకొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలను చేజిక్కింకొంటున్న అసాంఘీక శక్తులు వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇటువంటి ఘటనల నేపధ్యంలో ప్రజల వ్యక్తిగత గోప్యతను కాపాడవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వ్యక్తిగత గోప్యతను వారి ప్రాధమిక హక్కుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై లోతుగా విచారించేందుకు సుప్రీంకోర్టు 9మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. దానిలో ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్‌, జె.చలమేశ్వర్‌, రోహింటన్ నారీమన్, ఆర్.కె. అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్‌.ఎ. బొబ్డే, ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ఎ.ఎమ్‌. సప్రేలు సభ్యులుగా ఉన్నారు.

ఆ పిటిషన్లపై సుదీర్గ వాదోపవాదాలు జరిగిన తరువాత గురువారం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. దానిలో వ్యక్తిగత గోప్యత ప్రజల ప్రాధమిక హక్కు అని తేల్చి చెప్పింది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది. 

సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగ్గదే కానీ మన దేశంలో ఇటువంటి హక్కులు ఎన్నడూ ఖచ్చితంగా అమలుకావని అందరికీ తెలుసు. మనుషుల ప్రాణాలకే విలువీయనివారు వారి హక్కులకు విలువిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది కదా? 


Related Post