ఐదు-పదీ కాదు 50 ఏళ్ళు అధికారంలో ఉండాలిట!

August 19, 2017


img

మన రాజకీయ పార్టీల ఆలోచనా తీరుచూస్తుంటే అవి మన దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి మళ్ళీ రాజరికపు పాలనవైపు తీసుకువెళ్ళబోతున్నాయా?అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలు తామే మరో 30 ఏళ్ళపాటు అధికారంలో కొనసాగాలని, అంతవరకు చంద్రబాబు నాయుడు, కేసీఆరే ముఖ్యమంత్రులుగా కొనసాగాలని కోరుకొంటున్నామని ఆ పార్టీల నేతలు, మంత్రులు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఏపి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడిపోతున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈమధ్యనే తన మనసులో కోరికను బయటపెట్టేశారు. తనకు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించాలని ఉందని స్వయంగా చెప్పుకొన్నారు. 

ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రతిపక్షపార్టీల పట్ల అసహనం కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సభలు, సమావేశాలు, దీక్షలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. భావప్రకటన స్వేచ్చపై అప్రకటిత నిషేధం కనబడుతోంది. ఇక జాతీయస్థాయిలో కూడా పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. భాజపా హిందుత్వ అజెండాను అమలుచేస్తోంది. నిత్యం నీతి సూత్రాలు వల్లె వేసే భాజపా సామదానబేధ దండోపాయాలను ప్రయోగించి ఒక్కో రాష్ట్రాన్ని వశపరుచుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మద్యప్రదేశ్ లో జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, “మనం కేవలం ఐదేళ్లో లేక పదేళ్లో అధికారంలో ఉండేందుకు రాలేదు. కనీసం 50 సం.ల పాటు అధికారంలో ఉండాలి. అప్పుడే దేశాన్ని మళ్ళీ గాడిన పెట్టగలుగుతాము. మనకు దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది పార్టీ సభ్యులున్నారు.  1,387 మం‍ది ఎమ్మెల్యేలు, 330 మంది ఎంపీలు ఉన్నారు. మనమే 50 ఏళ్ళు అధికారంలో కొనసాగాలంటే ఈ బలం సరిపోదు. ఇంకా పెరగాలి. దేశం నలుమూలల భాజపా జెండా ఎగరాలి. దాని కోసం మనమందరం కలిసికట్టుగా ఇంకా కష్టపడాలి. అప్పుడే మన కల నెరవేరుతుంది,” అని అన్నారు. 

30-50 ఏళ్ళు అధికారంలో ఉండాలని కోరుకోవడం అంటే తామే శాస్వితంగా అధికారంలో ఉండాలని కోరుకోవడంగానే భావించవచ్చు.       అది ప్రజాస్వామ్యవిధానం కాదు రాజరిక వ్యవస్థ అవుతుంది. తెదేపా, తెరాస, భాజపా నేతల మాటలు, వారి చర్యలు, తమ ప్రత్యర్ధులను అణచివేయడానికి అమలుచేస్తున్న వ్యూహాలు నిశితంగా గమనించినట్లయితే వారు రాజరిక వ్యవస్థలను పునః స్థాపించాలని కోరుకొంటున్నారని అర్ధం అవుతోంది. 

ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలలోకి వచ్చామని రాజకీయ నాయకులు చెప్పుకొనేవారు. ఇప్పుడు పదవులు, అధికారం దక్కించుకోవడమే తమ ఏకైక లక్ష్యమని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. రాజకీయాల ప్రధాన లక్ష్యం అధికారం సాధించడమే తప్ప మరొకటి కాదని భాజపా ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేశారు.

అయితే అత్యంత ఆచరణీయమైన, ఆమోదయోగ్యమైన ప్రజాస్వామ్య విధానం వద్దనుకొని రాజరిక వ్యవస్థలను కోరుకొంటున్నప్పటికీ మళ్ళీ దానిని కాపాడుకోవడానికి, విస్తరించడానికి కూడా తమ ప్రత్యర్ధులతో నిత్యం యుద్ధాలు చేయకతప్పదని మన రాజకీయ నాయకులు గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఉదాహరణకు తెలంగాణాలో ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని తెరాస అధినేతలు భావిస్తుంటే, తెరాస సర్కార్ ను తిరగద్రోసి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, భాజపాలు కలలు కంటున్నాయి. కనుక వాటితో తెరాస యుద్దాలు చేయకతప్పదు. ఏపిలో కూడా చంద్రబాబు నాయుడు-జగన్మోహన్ రెడ్డిల మద్య అటువంటి యుద్దాలే సాగుతున్నాయిప్పుడు. ఇప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిపోయిందని, దాని కోసం ఎంతకైనా దిగజారుతున్నాయని కేంద్ర ఎన్నికల కమీషనర్ అచల్ కుమార్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే కదా!


Related Post