తెరాస సర్కార్ చిత్తశుద్ధి నిరూపించుకొంటుందా?

July 24, 2017


img

మియాపూర్ భూకుంభకోణం కేసులపై నుంచి అందరి దృష్టి మళ్ళించడానికే తెరాస సర్కార్ డ్రగ్స్ కేసులను తెరపైకి తెచ్చిందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసులు బయటపడిన తరువాత మియాపూర్ భూకుంభకోణంపై నుంచి అందరి దృష్టి మళ్ళిందనేది వాస్తవమే. అయితే ఈ డ్రగ్స్ కేసుల వలన కూడా తెరాస సర్కార్ అంతే అప్రదిష్ట మూటగట్టుకొంటోందనే సంగతి ప్రతిపక్షాలకు కూడా తెలుసు. పైగా ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులలో కూడా తెరాస నేతలున్నారని అవి చేస్తున్న ఆరోపణలతో తెరాస సర్కార్ ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది కదా? కనుక డ్రగ్స్ ముఠాల అరెస్ట్ తో మొదలైన ఈ కేసులను మియాపూర్ భూకుంభకోణంతో ముడిపెట్టి చూడటం సరికాదనే చెప్పాలి. 

“ఈ డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారున్నప్పటికీ, ఏ పార్టీకి చెందినవారున్నప్పటికీ ఎవరినీ విడిచిపెట్టేది లేదని” రాష్ట్ర హోం మంత్రి నాయిని నరిసింహారెడ్డి హూంకరించారు. అయితే కేవలం హూకరింపులతోనే సరిపెట్టకుండా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తెరాస నేతలపై కూడా విచారణ జరిపించినప్పుడే ఆయన మాటలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిజాయితీ, చిత్తశుద్ధి నిరూపితమవుతుంది. ప్రతిపక్షాలు ఊహిస్తున్నట్లు ఈ డ్రగ్స్ కేసులపై కూడా కొన్ని రోజులు ఇలాగే హడావుడి చేసి తరువాత వాటినీ ఓటుకు నోటు కేసులాగ అటకెక్కించేస్తే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక డ్రగ్స్ ని అరికట్టే విషయంలో తెరాస సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం చాలా అవసరం.  


Related Post