సూపర్ హిట్ బాహుబలి సినిమాలో రెండు భాగాలను కలిపి ఒకటిగా ఇటీవల విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాధరణ లభించింది.
ఇప్పుడు బాహుబలిని పౌరాణిక పాత్రలతో కలిపి బాహుబలి, ది ఎటర్నల్ వార్-1 పేరుతో మరో యానిమేషన్ సినిమా వస్తోంది. మంగళవారం విడుదలైన ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంది. ‘తన మరణం ఒక ముగింపు కాదు. ఓ మహాకార్యానికి ప్రారంభం..’ అంటూ రమ్యకృష్ణ చెప్పడంతో మరో కొత్త కధకి శ్రీకారం చుట్టారు దర్శకుడు ఇషాన్ శుక్లా.
దీనిలో మహా శక్తివంతుడైన బాహుబలిని చంపాలని ఇంద్రుడు ప్రయత్నిస్తుంటే, విషాసురుడు కాపాడుతుంటాడు. వారిద్దరి మద్య భీకర యుద్ధ సన్నివేశాలు, బాహుబలి శివ లింగం ఎదుట శివతాండవం చేస్తున్నట్లు, ఆ తర్వాత బాహుబలి-ఇంద్రుడికి మద్య యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.
బాహుబలి భవిష్యత్తులో 14 లోకాలను పాలించబోతున్నట్లు టీజర్‌లో చెప్పారు. ఇప్పుడు యానిమేషన్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది కనుక బాహుబలి సినిమాని యధాతధంగా తీశారనుకుంటే, దానిని ఈ విధంగా పౌరాణిక పాత్రలతో ముడిపెట్టి కొనసాగిస్తూ సరికొత్త కధతో బాహుబలి, ది ఎటర్నల్ వార్-1 యానిమేషన్ సినిమా తీస్తుండటం చాలా అభినందనీయమే.
ఈ సినిమాకి కధ: ఇషాన్ శుక్లా, సౌమ్య శర్మ, దర్శకత్వం: ఇషాన్ శుక్లా, స్క్రీన్ ప్లే: స్కాట్ మోసియర్, సంగీతం: ఎంఎం కీరవాణి, డైలాగ్స్: దేవా కట్టా, మదన్ కార్కి, సీజీ సూపర్ వైజర్: అభిషేక్ శుహంతో కర్మాకర్, విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్: రుపాలి గట్టి తదితరులు చేశారు.
రెండు భాగాలుగా వస్తున్న బాహుబలి, ది ఎటర్నల్ వార్-1 ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు.