వెంకయ్య ఉపరాష్ట్రపతి అయితే మనకు నష్టమే!

July 17, 2017


img

ఎన్డీయే తరపున వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఆయనకు ఆ విషయం తెలియజేశారు. కానీ ఆయన ఆ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఒకవేళ అయన అంగీకరిస్తే పార్లమెంటులో ఎన్డీయే కూటమికున్న ప్రస్తుతం ఉన్న బలంతో అవలీలగా ఉపరాష్ట్రపతి కాగలరు. కనుక అదే మరొకరైతే ఎగిరి గంతేసేవారే కానీ ఆ పదవి చేపడితే ఆయన ఇకపై రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి సహాయం చేయలేరు. కనుకనే ఆయన ఆ పదవికి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదని సమాచారం.

ప్రస్తుతం కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా సహచర కేంద్రమంత్రులు అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కనుక రెండు రాష్ట్రాలకు ఎటువంటి సహాయసహకారాలు అవసరమైన తక్షణమే సహచర మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపిలకు కేంద్రమంత్రులు, డిల్లీలో అధికారులకు మద్య ఆయన చక్కటి వారధిగా సేవలు అందిస్తున్నారు. కనుక ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఆయన చేతులు కట్టేసినట్లు అవుతుంది. దానివలన రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టపోతాయి. బహుశః అందుకే ఆయన ఆ పదవి చేపట్టడానికి విముఖత చూపుతున్నట్లు సమాచారం.

ఈరోజు సాయంత్రం భాజపా అత్యున్నత విధాన నిర్ణయ మండలి అయిన పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. దానిలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

యూపియే, దాని మిత్రపక్షాల తరపున మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చేనెల 5వ తేదీన జరుగుతాయి.        



Related Post