ప్రపంచ తెలుగుమహాసభల లోగో ఇదే!

July 12, 2017


img

ఈసారి ప్రపంచ తెలుగుమహాసభలను నిర్వహించే అవకాశం తెలంగాణా రాష్ట్రానికి దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో వాటిని హైదరాబాద్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. వాటి కోసం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. దానితో బాటు తెలంగాణా సాహిత్య అకాడమీ లోగోను కూడా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల ప్రకారం తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన చిత్రకారుడు రవిశంకర్, సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేట కళాకారుడు ఎంవి రమణారెడ్డి రూపొందించారు. వారిరువురినీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. 

తెలుగుమహాసభల లోగోలో తెలంగాణా వైభవానికి చిహ్నంగా చెప్పుకోబడే కాకతీయుల విజయతోరణం, దానికి ఇరువైపులా రెండు ఏనుగులు, వాటి చుట్టూ ‘మన తెలంగాణము- తెలుగు మాగాణము, ప్రపంచ తెలుగుమహాసభలు -2017’ అని వ్రాసున్న ఒక వృత్తాకారపు ఆర్చి దానిపైన (రాష్ట్రపక్షి) రెండు పాలపిట్టలు, క్రిందన ప్రపంచ తెలుగుమహాసభలు అని ఉన్నాయి. 

తెలంగాణా సాహిత్య అకాడమీ లోగోలో నీటి అలల వంటి ఒక పుస్తకం, దానిపై ‘పాళి’ని ముక్కుగా కలిగిన ఒక హంస బొమ్మ దాని చుట్టూ హిందీ ఇంగ్లీష్ బాషలలో, వాటి దిగువన తెలుగులో తెలంగాణా సాహిత్య అకాడమీ అనే పేరును అందంగా రూపొందించారు. పైన నీలి రంగులో తెలంగాణా సాహిత్య వృక్షం అని అర్ధం వచ్చే విధంగా తెలంగాణా చిత్రపటం దాని చుట్టూ కొమ్మలు అందంగా చిత్రీకరించారు. కానీ దీనిలో ఒకే ఒక లోపం కనబడుతోంది. హైదరాబాద్ నగరంతో, తెలంగాణా ప్రజల బాష, తెలంగాణా సాహిత్యంతో అవిభాజ్యమైన సంబంధం కలిగిన ఉర్ధూ బాషకు చోటు కల్పించలేదు. కనుక ఉర్దూను కూడా చేర్చి తెలంగాణా సాహిత్య అకాడమీ లోగోను పునర్ముద్రిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఖరారు చేసిన లోగోని పూర్తగా మార్చకుండానే దానిలో గల హంస రెక్కలలో ఉర్దూ బాషని అందంగా పొదగవచ్చు. అలా చేస్తే తెలంగాణా సాహిత్యానికి పరిపూర్ణత చేకూరుతుంది. 

ప్రపంచ సాహిత్యంలో తెలంగాణా కవులు, రచయితల పాత్రను అందరికీ చాటిచెప్పే విధంగా ఈసారి ప్రపంచ తెలుగుమహాసభలలో కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి చెప్పారు. కాళోజీ, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి, వానమామలై వరదాచార్య వంటి ప్రముఖ సాహిత్యకారుల మోనోగ్రాములను ముద్రిస్తామని చెప్పారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశవిదేశాలలో ఉన్న తెలుగుసాహిత్యకారులను ఈ ప్రపంచమహా సభలకు ఆహ్వానించి వారితో సాహిత్య కార్యక్రమాలు నిర్వహింపజేయాలని సిద్దారెడ్డి భావిస్తున్నారు. 



Related Post