బుదవారం ఖమ్మం సభలో పాల్గొన్న నలుగురు ముఖ్యమంత్రులు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం చెప్పిన్నట్లు అడే గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని, వారిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలపై ప్రధాని నరేంద్రమోడీ పెత్తనం చేయాలనుకొంటున్నారని కనుక గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌లో అనేక ఫైల్స్ తొక్కిపట్టారని కేసీఆర్ విమర్శించారు.
కేసీఆర్ విమర్శలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆమె ఈరోజు రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్‌ని ఉద్దేశ్యించి కేసీఆర్, ఆయన మంత్రులు పదేపదే అవహేళనగా మాట్లాడుతూ, ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి గవర్నర్‌ని గౌరవించాలని తెలియదా?నేను కూడా మూడు దశాబ్ధాలకి పైగా రాజకీయాలలో ఉన్నాను. గవర్నర్ వ్యవస్థ విలువ ఏమిటో... దానికి ఎంత గౌరవముందో నాకు తెలుసు. గవర్నర్‌గా నేనెప్పుడూ నా పరిధిని అతిక్రమించలేదు. సిఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రవర్తిస్తూ తిరిగి రాజ్‌భవన్‌లో ఫైల్స్ తొక్కిపట్టారని విమర్శిస్తున్నారు. ముందుగా ఆయన ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదో సమాధానం చెపితే నేనూ ఫైల్స్ ఎందుకు ఆమోదముద్ర వేయలేదో చెపుతాను. మరో వారం రోజులలో గణతంత్ర దినోత్సవం ఉంది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి సమాచారం రాలేదు. దీనిని నేను ఏమనుకోవాలి? ఇది గవర్నర్ వ్యవస్థని అవమానించడం కాదా?” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు.
కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ వద్దనుకొంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాక రద్దు చేసుకోవచ్చు. కానీ అంతవరకు ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్‌ని గౌరవించాల్సిందే కదా?ముఖ్యంగా ఓ మహిళ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు ఆమెతో కేసీఆర్ మరింత గౌరవంగా వ్యవహరించి ఉంటే ఆయన గౌరవమే పెరిగి ఉండేది. కానీ గవర్నర్ కోటాలో తాను ఎమ్మెల్సీగా చేసిన సిఫార్సు కౌశిక్ రెడ్డిని ఆమె తిరస్కరించడంతో కేసీఆర్ అహం దెబ్బతింది. అప్పటి నుంచే ఆమెపై ద్వేషం పెంచుకొన్నారు.
అయితే ‘గవర్నర్ కోటా’లో ఎవరిని ఎమ్మెల్సీగా నియమించాలనేది గవర్నర్ ఇష్టం. కౌశిక్ రెడ్డి అందుకు తగినవాడు కాడని ఆమె భావించి తిరస్కరించారు. కనుక ఈ విషయంలో ఆమెని తప్పు పట్టడానికే లేదు. కానీ కేసీఆర్ ఆమెని తప్పు పట్టి కత్తులు దూస్తున్నారు. దాని వలన ఆమె కొన్ని అవమానాలు భరించాల్సివస్తోంది తప్ప అంతకి మించి ఆమెకి ఎటువంటి నష్టమూ లేదు. కానీ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్స్‌పై ఆమె సంతకం చేయకపోతే ఇబ్బందిపడేది రాష్ట్ర ప్రభుత్వమే కదా?పైగా మహిళా గవర్నర్‌ని అవమానిస్తున్నారనే అపవాదు కూడా కేసీఆర్‌కి మిగిలిపోతుంది కదా?