మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ యావత్ దేశంలోని ముస్లింలకు ప్రతినిధ్యం వహిస్తోందన్నట్లు మాట్లాడుతుంటారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మజ్లీస్ అభ్యర్ధులను బరిలో దింపుతుంటారు. గుజరాత్ ఎన్నికలలో కూడా 13మందిని బరిలో దింపి విస్తృతంగా ప్రచారం చేశారు కూడా. ఈ ఎన్నికలలో పోటీ చేసిన ఆమాద్మీ పార్టీ 5 సీట్లు గెలుచుకొంది. కానీ మజ్లీస్ అభ్యర్ధులందరూ డిపాజిట్లు కోల్పోయారు. వారిలో చాలా మందికి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికలలో మజ్లీస్ పార్టీకి కేవలం 0.29 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయంటే మజ్లీస్ పార్టీ ఎంత నిరాధారణకి గురయ్యిందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలలో ఆమాద్మీ బరిలోకి దిగడంతో తీవ్రంగా నష్టపోయామని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తమ ఓటమికి మజ్లీస్ కూడా కారణమే అని ఆరోపిస్తోంది. మజ్లీస్‌కు గెలిచే అవకాశం లేదని తెలిసినా పోటీకి దిగి తమ విజయావకాశాలను దారుణంగా దెబ్బ తీసిందని గుజరాత్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు జె.ఠాకూర్ ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ఓట్లు చీల్చి బిజెపికి పరోక్షంగా తోడ్పడ్డాయని జె.ఠాకూర్ ఆరోపించారు.
ఇదివరకు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలప్పుడు కూడా మజ్లీస్ పార్టీపై ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంది. అక్కడ బిజెపిని గెలిపించేందుకే సిఎం కేసీఆర్ మజ్లీస్ పార్టీని ప్రోత్సహించి పోటీ చేయించారని, అది అక్కడ ముస్లింల ఓట్లను విజయవంతంగా చీల్చి బిజెపి గెలుపుకి దోహదపడిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే మజ్లీస్ వేరే రాష్ట్రాలలో గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించగలదని స్పష్టమవుతోంది. కనుక సార్వత్రిక ఎన్నికలలో కూడా మజ్లీస్ వలన కాంగ్రెస్‌కి నష్టం తప్పకపోవచ్చని భావించవచ్చు.
అయితే ఓ రాజకీయ పార్టీగా మజ్లీస్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కనుక కాంగ్రెస్ వైఫల్యం లేదా అసమర్దతకి మజ్లీస్ జవాబుదారీ కాదు. కానీ వేరే రాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలోనే మజ్లీస్ పోటీ చేస్తున్నప్పటికీ ఎందుకు గెలవలేకపోతోంది? అని మజ్లీస్ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకి కేరళలో ముస్లింలు, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు, మహారాష్ట్రలో ముస్లింలు, గుజరాత్‌లో ముస్లింలు ఒకేలా ఆలోచించరు. ఆయా రాష్ట్రాల భాష, సంస్కృతి తదితర ప్రభావం వారిపై ఉంటుంది. ఇది గమనించకుండా ముస్లింలు ఎక్కడ ఉన్నా ముస్లింలే వారందరూ ఒకేలా ఉంటారనే తప్పుడు అంచనాతో బరిలో దిగుతుండటం వలననే మజ్లీస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎన్నికలలో ఓటమి పాలవుతున్నట్లు చెప్పవచ్చు.
అదే... హైదరాబాద్ ముస్లింల సంస్కృతి, వారి జీవనశైలి, వారి సమస్యల పట్ల మజ్లీస్‌కి పూర్తి అవగాహన ఉంది కనుక ప్రతీ ఎన్నికలో గెలవగలుగుతోందని చెప్పవచ్చు. కనుక మజ్లీస్ అధినేతలు పాతబస్తీలో కూర్చొని రాజకీయాలు చేస్తున్నంత కాలం జాతీయపార్టీగా ఎదగడం కష్టమే.