కాంగ్రెస్‌ మిత్రపక్షాల అభ్యర్ధికి టిఆర్ఎస్‌ మద్దతు

June 27, 2022


img

రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్ర పక్షాల అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం  నామినేషన్ వేయబోతున్నారు. ఆయనకు టిఆర్ఎస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌, లోక్‌సభ టిఆర్ఎస్‌ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర రావు, టిఆర్ఎస్‌ ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చొరవ తీసుకొని దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టేందుకు ఢిల్లీలో అఖిలవిపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీని కూడా దానికి ఆహ్వానించినందున సిఎం కేసీఆర్‌ దానికి హాజరుకాలేదు. టిఆర్ఎస్‌ తరపున ఎవరినీ పంపలేదు. కానీ కాంగ్రెస్‌ బలపరుస్తున్న యశ్వంత్ సిన్హాకు ఇప్పుడు మద్దతు ప్రకటించారు. కనుక ఇది కేవలం రాష్ట్రపతి ఎన్నికలకే పరిమితమా భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిఎం కేసీఆర్‌ సిద్దపడుతున్నారా?అనేది మున్ముందు తెలుస్తుంది.

రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ వేశారు. దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటించడంతో ఆమె విజయం ఖాయమైపోయింది. కనుక యశ్వంత్ సిన్హా ఓటమి ఖాయం అని తెలిసీ రేపు నామినేషన్ వేయబోతున్నారు. 


Related Post