డిల్లీ అల్లర్లు...దేశానికి ఓ హెచ్చరిక

February 26, 2020


img

పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ మొదట ఈశాన్య రాష్ట్రాలలో ఉవ్వెత్తున ఆందోళనలు..విధ్వంసం జరిగింది. అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని మళ్ళీ అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాలి. కానీ పొరుగింటికి మంటలు అంటుకుంటే మనకేం సంబందం?అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. 

మళ్ళీ ఇప్పుడు అదే సీఏఏ కారణంగా డిల్లీలో అంతకంటే తీవ్రస్థాయిలో అల్లర్లు జరిగాయి. కేవలం రెండురోజులలో 20 మంది చనిపోగా సుమారు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కేంద్రప్రభుత్వం పారామిలటరీ దళాలను మోహరించవలసి వచ్చింది. అయితే భద్రతాదళాలను మోహరించడం ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారమే తప్ప శాస్వితం కాదు.  

ఎందుకంటే, రాజకీయపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన సీఏఏ అంశంతో చెలగాటం ఆడుతూనే ఉన్నాయి. కనుక ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ మళ్ళీ ఎక్కడైనా ఇటువంటి అల్లర్లు మొదలైతే ఏమవుతుందో డిల్లీలో జరిగిన విధ్వంసం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ దేశవ్యాప్తంగా ఇటువంటి అల్లర్లు, విధ్వంసం జరిగి ఉండి ఉంటే ఏమయ్యుండేదో ఊహించలేము కూడా. కనుక ఈ సమస్యకు శాస్విత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. 

రాజకీయపార్టీలు సీఏఏకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ప్రజలను ప్రోత్సహించడం మానుకుంటే మంచిది. అలాగే ప్రజలు కూడా ఈ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. లేకుంటే ఏమి జరుగుతుందో డిల్లీ అల్లర్లే కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. 

అయితే ఈ సమస్యలు పరిష్కారం ఏమిటి?అంటే దేశంలో మేధావులు, ప్రజాసంఘాలు, మీడియా చొరవ తీసుకొని తమ సొంత రాజకీయ అభిప్రాయాలకు, అవసరాలకు అతీతంగా సీఏఏలో లాభనష్టాలు, లోటుపాట్ల గురించి చర్చించి, దాని గురించి ప్రజలకు వివరిస్తే దేశానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఒకవేళ దానిలో ఏవైనా లోపాలున్నట్లయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ సీఏఏ వలన దేశానికి మేలుకలుగుతుందంటే దాని గురించి ప్రజలలో నెలకొన్న అనుమానాలను, అపోహలను తొలగించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే, దేశసమగ్రతను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదీ కనుక. 


Related Post