ఈ పరిస్థితికి అవే కారణం: కెసిఆర్

April 13, 2018


img

సిఎం కెసిఆర్ శుక్రవారం బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవగౌడతో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, భాజపాల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే దేశంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. ఏడు దశాబ్దాల తరువాత కూడా నీళ్ళ కోసం రాష్ట్రాలు కొట్టుకొంటుంటే కేంద్రప్రభుత్వం చోద్యం చూస్తోదని విమర్శించారు. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసమే తాను ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేస్తున్నానని చెప్పారు. అయితే నిజానికి ఇది ధర్డ్ ఫ్రంట్ కాదని దేశ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రూపుదిద్దుకొంటున్న ‘ప్రజా ఫ్రంట్’ అని చెప్పారు. తమతో కలిసివచ్చే పార్టీలను అన్నిటినీ కలుపుకు పోతామని కెసిఆర్ చెప్పారు. దేవగౌడ ఆహ్వానిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తానని కెసిఆర్ చెప్పారు.  

కెసిఆర్ తరువాత మాట్లాడిన దేవగౌడ తెలంగాణాలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకొన్నారు. వాటిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలుచేస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఫ్రంట్ ఏర్పాటు గురించి కెసిఆర్ మాట్లాడారు కానీ దేవగౌడ ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. 

వారి తరువాత మాట్లాడిన ప్రకాష్ రాజ్, ఏ పార్టీ, కూటమికి మద్దతు ఇస్తే తమకు మేలు చేస్తుందో ఆలోచించుకొని ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. దేశరాజకీయాలలో మార్పు చేయవలసిన సమయం ఆసన్నమైంది. మార్పు కోరేవారందరూ ముందుకు వచ్చి చేతులు కలపాలి,” అని అన్నారు. 


Related Post