రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్ లో భద్రతాదళాలు 13 మంది ఉగ్రవాదులతో హోరాహోరీ పోరాడి మట్టుబెట్టాయి. దానిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది స్పందిస్తూ, “భారత ఆక్రమిత కశ్మీర్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తున్నారు. అమాయక ప్రజలు అన్యాయంగా బలైపోతున్నారు. అక్కడ ఇంత హింస, రక్తపాతం జరుగుతున్నా ఐక్యరాజ్యసమితి, ఇతర సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదో?” అని ట్వీట్ చేశాడు.
అఫ్రీదీ వ్యాఖ్యలపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. అతనికి బుద్ధి మాంద్యం ఉన్నట్లుంది. అతను యుఎన్ స్పందించాలని అన్నాడు. అతని దృష్టిలో యుఎన్ అంటే అండర్ నైన్టీన్ కావచ్చు. అతను నోబాల్ వేసి వికెట్ పడిందని పండగ చేసుకొంటే మనం పట్టించుకోనక్కరలేదు,” అని అన్నాడు.
కశ్మీర్ లో నిత్యం ఉగ్రవాదులు భారత భద్రతాదళాలపై దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వీలుచిక్కితే కట్టుదిట్టమైన భద్రత కలిగిఉన్న ఆర్మీ క్యాంపులలోకి కూడా జొరబడి ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు. మారణాయుధాలతో ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులను భారత్ భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి మట్టుబెడుతుంటే, వారిని అఫ్రీదీ వంటివారు కూడా స్వాతంత్ర సమరయోధులని, అమాయక ప్రజలని అనడం చాలా విచిత్రంగా ఉంది.
భారత్ లో విద్వంసం సృష్టించి అనేకమంది అమాయక ప్రజల మరణానికి కారకుడైన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను ఇంతకాలం వెనకేసుకు వచ్చిన పాక్ పాలకులు, ఇప్పుడు అతను రాజకీయపార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, పాక్ పగ్గాలు చేపట్టాలని ప్రయత్నించేసరికి ఉలిక్కిపడి ‘అతనొక ఉగ్రవాది’ అంటున్నారు. అంటే భారత్ లో విద్వంసం సృష్టిస్తే స్వాతంత్ర పోరాటయోధుడు. అదే..వ్యక్తి పాక్ రాజకీయాలలో వేలుపెడితే ఉగ్రవాదిగా కనబడతాడన్న మాట! ఈ ద్వంద వైఖరికి అఫ్రీదీ కూడా అతీతుడుకాడని నిరూపించుకొన్నాడు.