ప్రభుత్వమే ఆందోళన చేస్తే...

April 03, 2018


img

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని రాష్ట్రాలను పాలించడానికే ఉన్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడం వాటి బాధ్యత. కానీ నేడు రాజకీయ కారణాలతో అవే సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడును చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రిపన్నీర్ సెల్వం, మంత్రులు, అధికార అన్నాడిఎంకె ప్రజాప్రతినిధులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. కావేరీ రివర్ వాటర్ మేనేజిమెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడిఎంకె ఎంపిలు లోక్ సభలో ఎంత ఆందోళన చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దాని కోసం ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ మంత్రులు, నేతలు అందరూ మంగళవారం నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఫిబ్రవరి 16లోగా కావేరీ బోర్డు ఏర్పాటు  చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా దాని ఆదేశాలు కేంద్రం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో అధికార పార్టీ రాజకీయ మైలేజీ పొందాలని ప్రయత్నిస్తోంది కనుక ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె పార్టీ ఈనెల 16న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. 

రాష్ట్ర సమస్యలను పరిష్కరించవలసిన అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి రోడ్లపైకి రప్పిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. అయినా వాటికి రాష్ట్ర శ్రేయస్సు కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని భావించవలసి ఉంటుంది. 

రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టులు, వాటికి అనుమతులు మంజూరు చేసే హక్కులను గుప్పిట పట్టుకొని కర్ర పెత్తనం చేస్తున్న కేంద్రప్రభుత్వం, రాష్ట్రాల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తనది కాదన్నట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం. 

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో విజయం సాధించి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని భాజపా తహతహలాడుతోంది. కనుక కర్ణాటక ప్రజలకు ఆగ్రహం కలిగించే ఏ పని కేంద్రం చేయదు. అందుకే కావేరీ బోర్డు గురించి తమిళనాడు ఎంపిలు ఎంత ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ సంగతి అన్నాడిఎంకె ఎంపిలతో అన్ని పార్టీల ఎంపిలకు చాలా బాగా తెలుసు. కానీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివే...ఎవరి లెక్కలు వారివే కనుక అందరూ తమతమ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ రోజులు దొర్లించేస్తున్నారు. దేశాన్ని, రాష్ట్రాలను ఉద్దరిస్తాయని ఎన్నుకొన్న పార్టీలు, అవి నడిపే ప్రభుత్వాలు ఈవిధంగా భాద్యాతారహితంగా వ్యవహరిస్తుండటం భారత ప్రజల దౌర్భాగ్యమే కదా!  


Related Post