మాది నలుగురి పాలన కాదు: హరీష్ రావు

March 26, 2018


img

తెరాస సర్కార్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు కీలక పదవులలో ఉన్నందున, ప్రభుత్వం...రాష్ట్రం వారి నలుగురు చేతుల్లో చిక్కుకొందని, రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబపాలన సాగుతోందని తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే ఆ నలుగురు కూడా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ప్రజా ప్రతినిధులేనని అందరికీ తెలుసు. వారు ఆ పదవులు చేపట్టక మునుపు ఆ తరువాత కూడా తమ సమర్ధతను నిరూపించుకొన్నవారే. వారు కూడా మిగిలిన ప్రజా ప్రతినిధులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువే రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అయినప్పటికీ వారు ఒకే కుటుంబానికి చెందినవారుకావడంతో తరచూ ‘కుటుంబపాలన’ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. 

శాసనసభలో ఆదివారం బడ్జెట్ పై జరిగిన చర్చలో తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ‘కుటుంబపాలన’ సాగుతోందంటూ విమర్శలు చేశారు. వారికి మంత్రి హరీష్ రావు సమాధానం చెపుతూ, “ప్రతిపక్ష సభ్యులు ఈవిధంగా మాట్లాడటం చాలా బాధాకరం. గత ప్రభుత్వాల హయంలో స్వపక్ష, విపక్ష సభ్యుల పట్ల వివక్ష కనిపించేది. కానీ మా ప్రభుత్వం అమలుచేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి చెక్కులను ఆయా నియోజకవర్గాలలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేతికే అందజేసి వారి ద్వారానే మేము పంపిణీ చేయిస్తున్నాము. 

గతంలో ఒక్కో ఎమ్మెల్యే, మంత్రికి కలిపి తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్లు నిధులు అందించేవారు. కానీ మా ప్రభుత్వం మంత్రులతో సంబంధం లేకుండా ఒక్కో ఎమ్మెల్యేకు  రూ.3 కోట్లు ఇస్తోంది. తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను చేసుకొనేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు కల్పించాము. ఈవిధంగా అధికార, విపక్ష ఎమ్మెల్యేలానే భేదభావం చూపకుండా అందరికీ సమానంగా అధికారం, నిధులు పంపిణీ చేస్తున్నప్పుడు నలుగురి చేతిలోనే అధికారం ఉండిపోయిందని ప్రతిపక్ష సభ్యులు ఏవిధంగా అనగలుగుతున్నారో నాకు అర్ధం కావడంలేదు,” అని అన్నారు. 


Related Post