అన్నా...ఈసారి ఎవరికి లిఫ్ట్ ఇస్తారో?

March 23, 2018


img

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నేటి నుంచి డిల్లీలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కల్పించాలని, సమర్ధమైన లోక్ పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దీక్షకు కూర్చొన్నారు. అయన శుక్రవారం ఉదయం రాజ్ ఘాట్ చేరుకొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తరువాత తన మద్దతుదారులతో కలిసి రాం లీలా మైదానం చేరుకొని నిరాహా దీక్ష ప్రారంభించారు. 

ఇదివరకు అంటే, 2011లో లోక్ పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కూడా అయన అక్కడే నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండేది. నిత్యం కుంభకోణాలు బయటపడుతుండేవి. కనుక అది అయన దీక్షను సహించక తప్పలేదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రత్యక్షంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. పైగా అది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. కనుక అన్నా హజారేను మోడీ సర్కార్ ఉపేక్షించకపోవచ్చు. పోలీసులతో ఆయన దీక్షను భగ్నం చేయించవచ్చు. 

అప్పుడు అయన చేసిన నిరవధిక నిరాహార దీక్ష వలన దేశంలో అవినీతి అంతం కాలేదు కానీ ఆయన పేరు చెప్పుకొని అయన శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఆమాద్మీ పార్టీ పెట్టి వరుసగా రెండుసార్లు డిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక ఈసారి అన్నా హజారీ చేపట్టబోతున్న ఈ దీక్షతో ఎవరు వెలుగులోకి వస్తారో చూడాలి.


Related Post