నాగంకు టికెట్ ఇస్తే ఊరుకోము: దామోదర్ రెడ్డి

March 23, 2018


img

నాగం జనార్ధన్ రెడ్డి నిన్న భాజపాకు రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు కానీ ఆయన రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. 

నాగర్ కర్నూల్ లో అయన మీడియాతో మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా మేము మా నియోజకవర్గంలో నాగం జనార్ధన్ రెడ్డితో పోరాడుతున్నాము. అయన వలన కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. అనేకమంది కార్యకర్తలకు అయన ద్రోహం చేశారు. అటువంటి మా రాజకీయ ప్రత్యర్ధిని తీసుకువచ్చి మా నెత్తిన పెడితే మోయడానికి మేము సిద్దంగా లేము. ఒకవేళ అయనను పార్టీలో చేర్చుకొంటే ఆయన రాకను వ్యతిరేకిస్తూ మాపార్టీలో కొంతమంది రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. పార్టీలో 60 ఏళ్ళకు పైబడిన వారు పదవులు ఆశించవద్దని రాహుల్ గాంధీ చెప్పారు కనుక నాగం జనార్ధన్ రెడ్డి టికెట్ ఆశించి మా పార్టీలో చేరినా ప్రయోజనం ఉండదు. మేము మా అధిష్టానం మాటను గౌరవించి నాగమను పార్టీలో చేరడానికి అంగీకరించవలసివచ్చినా, వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం ఊరుకోబోము,” అని హెచ్చరించారు.

నాగం జనార్ధన్ రెడ్డిని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రప్పిస్తున్నారని వారిరువురూ కలిసి జిల్లాలో పార్టీలో చిచ్చుపెట్టడం ఖాయమని దామోదర్ రెడ్డి హెచ్చరించారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించక ముందే ఇంత వ్యతిరేకత ఎదుర్కోవలసివస్తోంది. పార్టీలో చేరిన తరువాత మరెన్ని గొడవలు జరుగుతాయో?


Related Post