ఆర్టీసికి ఎప్పుడూ నష్టాలేనా?

March 14, 2018


img

దశాబ్దాలుగా ఆర్టీసి నష్టాలతోనే కొనసాగుతోంది. దానిని లాభాల బాట పట్టించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ఆర్టీసి గురించి తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనమండలిలో అడిగిన ఒక ప్రశ్నకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి  చెప్పిన సమాధానం బట్టి ఆర్టీసీని గాడిన పెట్టడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని స్పష్టం అయ్యింది. ఆర్టీసి నష్టాలతో సాగుతోందని, దానిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బారీగా నిధులు సమకూర్చుతోందని చెప్పారు. 

2017-18సం.లలో పెరిగిన వేతనాల చెల్లింపు కోసం రూ.428 కోట్లు, బస్ పాస్ రాయితీల కోసం రూ. 230 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలుకు రూ.70 కోట్లు కలిపి మొత్తం రూ.728 కోట్లు ఆర్టీసికి సమకూర్చమని తెలిపారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల వలన, పల్లెవెలుగు బస్సుల వలన ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఆర్టీసికి నష్టం కలిగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కటిన చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఆర్టీసి ఆదాయం పెంచుకోవడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.   

ప్రభుత్వం ఆర్టీసికి ఒక్క ఏడాదిలోనే రూ. 728 కోట్లు అందించినప్పటికీ ఇంకా నష్టాలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్టీసి నష్టాలకు కారణాలు ఏమిటో...వాటికి పరిష్కారాలు ఏమిటో అందరికీ తెలుసు. అయినా దానిని ఎవరూ గాడినపెట్టలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 

టీఎస్ఆర్టీసి రాష్ట్రవ్యాప్తంగా అనేక వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది కానీ వాటిని అది సద్వినియోగపరుచుకోలేకపోతోంది. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన పట్టణాలలో 75 శాతం పైగా ఆక్యుపెన్సీ తో బస్సులు నడుస్తున్నాయి. అయినా ఆర్టీసి నష్టాలలోనే ఉంది. అదే...ప్రైవేట్ సంస్థలకు ఇన్ని ఆస్తులు, ప్రభుత్వ సహాయసహకారాలు లేనప్పటికీ అవి లాభాలు గడించగలుగుతున్నాయి. ప్రతీ ప్రైవేట్ సంస్థ ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతున్నాయి కూడా.  ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతున్నప్పుడు ఆర్టీసి ఎందుకు లాభాలు ఆర్జించలేకపోతోంది? 

సాధారణంగా ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ కొంత కాలానికి స్వయంసంవృద్ది సాధించి నిలద్రొక్కుకొని మరింత విస్తరిస్తుంటుంది. కానీ ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఆర్టీసి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా ప్రభుత్వం సహాయం అందించకపోతే కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంటుంది. ప్రభుత్వంపై ఎప్పుడూ ఆధారపడకుండా జి.హెచ్.ఎం.సి.లాగ ఆర్టీసి కూడా స్వయంసంవృద్ధి సాధించాలంటే ఏమి చేయాలో పాలకులు ఆలోచిస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు నిధులు అందించి చేతులు దులుపుకోవడం కంటే ఆర్టీసి కూడా స్వయంసంవృద్ధి సాధించేలా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆర్టీసిపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడున్నాయి. నిత్యం కొన్ని లక్షలమంది ఆర్టీసి బస్సులలో ప్రయాణిస్తున్నారు కనుక.


Related Post