కేంద్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొంటే మంచిదేమో?

February 08, 2018


img

తెరాస ఎంపి జితేందర్ రెడ్డి నిన్న లోక్ సభలో మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి న్యాయం జరుగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఆలోచనలు, ప్రతిపాదనలు, లక్ష్యాలు అన్నీ చాలా ఉన్నతంగానే ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లుగా బడ్జెట్ లో కేటాయింపులు జరుపకపోవడాన్ని తప్పు పట్టారు. దేశంలో సామాన్య ప్రజలందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారతి’ పధకమే అందుకు ఒక ఉదాహరణ అని అన్నారు. 130 కోట్లు మంది జనాభా ఉన్నప్పుడు దీనికోసం కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఏవిధంగా దీనిని విజయవంతం చేయగలరని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా తెలంగాణాలో తమ ప్రభుత్వం చేపడుతున్న కెసిఆర్ కిట్స్, ఏడాదిలో రెండు పంటలకు ఎకరానికి రూ.8,000 పెట్టుబడి, రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అందించడం వంటి పధకాల గురించి వివరించి వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే పంటలకు మద్దతుధర విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా జితేందర్ రెడ్డి తప్పు పట్టారు. ఇప్పటికే తమ ప్రభుత్వంపై వివిధ ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల కోసం చాలా ఆర్దికభారం మోస్తోందని, కనుక పంటల మద్దతుధర భారం పూర్తిగా కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పధకాల అమలుకు అవసరమైన నిధులు మంజూరు చేసినప్పుడే అవి విజయవంతం అవుతాయని అన్నారు.   

 ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా సంక్షేమ పధకం విజయవంతం అవ్వాలంటే, వాటికి ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చి, చిత్తశుద్ధితో చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నిర్మితమవుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులను, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమ పధకాలను అందుకు చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇతర రాష్ట్రాలు కూడా వాటి నుంచి ప్రేరణ పొందుతున్నప్పుడు కేంద్రం కూడా తెలంగాణా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తన అభివృద్ధి,సంక్షేమ పధకాల అమలులో అటువంటి చిత్తశుద్ధి, నిధుల కేటాయింపులు, ఆచరణలో ఖచ్చితత్వం ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోగలిగితే అది చేస్తున్న లక్షల కోట్ల ఖర్చుకు తగిన ఫలితాలు తప్పక కనిపిస్తాయి! లేకుంటే ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎటువంటి ఫలితాలు సాధించలేని ఈ బడ్జెట్ గారడీ ఏటేటా కొనసాగుతూనే ఉంటుంది.


Related Post