అయితే నాగంకు లైన్ క్లియర్ అయినట్లే!

February 06, 2018


img

భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి తాను ఉగాది తరువాత పార్టీని వీడబోతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంగళవారం ఆయనకు సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటే ఆయనను సాదరంగా ఆహ్వానించి సముచిత గౌరవం ఇస్తాము. పార్టీలో అయన చేరికను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదు. అయన చేరికకు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు,” అన్నారు. 

నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం ఎంత నిజమో, డికె అరుణ తదితరులు అయన రాకను వ్యతిరేకిస్తున్న మాట అంతే నిజం. కొన్ని రోజుల క్రితం ఆమె ఇదే పనిమీద డిల్లీ వెళ్ళారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో కుంతియా నిర్ణయానికి తిరుగులేదు కనుక నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే భావించవచ్చు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరడానికి ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారో తెలియదు.


Related Post